హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కిషోర్ తన కుమార్తెను ఇంజనీర్‌ని చేయాలనుకుంటున్నాడు. అతని కూతురు ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. అంటే.. ఆమె 10 సంవత్సరాల తర్వాత B.Tech చేస్తుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు ప్రస్తుతం 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుల కోసం అని కిషోర్ బ్యాంక్‌లో 10 లక్షల రూపాయల ఎఫ్‌డీని తెరిచారు. ఇప్పుడు అతను కోర్సు ఫీజుల గురించి ఏ మాత్రం టెన్షన్ పడటం లేదు. అయితే, ఆయన నిర్ణయం సరైనది కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పదిలక్షల రూపాయల ఎఫ్‌డీతో తన కూతురుని ఇంజనీరింగ్ చదివించడం అయ్యేపని కాదు. దీనికి కారణం తన డబ్బును ఆయన ఎక్కువ కాలం బ్యాంకులో డిపాజిట్ చేశారు. అలా అంత ఎక్కువ కాలం డబ్బును బ్యాంక్‌లో డిపాజిట్ చేయకూడదు. ఎందుకు? తెలుసుకుందాం.
నిజానికి, బ్యాంక్ ఎఫ్‌డీ పై రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ప్రభావవంతంగా ఉండదు. మీరు పన్ను పరిధిలోకి వస్తే, ఈ రాబడి మరింత తక్కువగా ఉంటుంది. కిషోర్ చేసిన ఎఫ్‌డీ వార్షిక వడ్డీ 6.5 శాతం. అతను 10 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై మొత్తం 19.05 లక్షల రూపాయలను పొందుతాడు. ఇందులో వడ్డీ ఆదాయం 9.05 లక్షల రూపాయలు. కిషోర్ ను ఇది 30 శాతం టాక్స్ శ్లాబ్‌లోకి తీసుకువెళుతుంది. అందుకే దాదాపు 2.75 లక్షల రూపాయలు పన్ను పరిధిలోకి వస్తాయి. అందువల్ల అతని చేతిలో 16.30 లక్షల రూపాయలు మాత్రమే మిగులుతాయి. పన్ను చెల్లించిన తర్వాత, ఈ ఎఫ్‌డీపై కిషోర్ నికర రాబడి కేవలం 5 శాతం మాత్రమే. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7 శాతం స్థాయిలో ఉంది. అటువంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ఎఫ్‌డీపై రాబడి ప్రభావవంతంగా ఉండదు.
మరోవైపు విద్యా వ్యయం 10 శాతం మేర పెరుగుతోంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సుకు ప్రస్తుతం 10 లక్షల రూపాయలు ఉంటే, 10 ఏళ్ల తర్వాత అది 26.85 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ విధంగా, పెట్టుబడి విషయంలో చేసిన ఒక పొరపాటు కారణంగా, కిషోర్ తన లక్ష్యాన్ని చేరుకోలేడు. తన కూతురి కల నెరవేరాలంటే మరో 10 లక్షల రూపాయలు అతనికి కావాలి. అటువంటప్పుడు దీర్ఘకాలిక దృక్పథం ఉంటే కిషోర్ లాంటి వారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది ఇప్పుడు ప్రశ్న?
దీర్ఘకాలిక ఎఫ్‌డిలలో డబ్బును పెట్టుబడి పెట్టడంలో విజ్ఞత లేదని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ జితేంద్ర సోలంకి చెప్పారు. ఈ పెట్టుబడిపై రాబడితో దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడం కష్టం. పెట్టుబడి దృక్పథం ఐదేళ్ల కంటే ఎక్కువ ఉంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి మంచి ఎంపిక అని ఆయన అంటున్నారు. దీర్ఘకాలంలో, మీరు ఈ పెట్టుబడిపై 12 శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు. దీనివల్ల లక్ష్యాన్ని సాధించడం సులభతరం అవుతుంది.
ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్న ఆప్షన్స్ ఏమిటో చూద్దాం.. గత 10 సంవత్సరాలలో 16 నుంచి 18 శాతం రాబడిని అందించిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లకు సంబంధించిన అనేక పథకాలు ఉన్నాయి. కిషోర్ ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే. 12 శాతం వార్షిక రాబడిని ఊహిస్తే, 10 సంవత్సరాల తర్వాత 32.62 లక్షల రూపాయల ఫండ్ జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 22.62 లక్షల రూపాయల లాభం ఉంది. మనం టాక్స్ గురించి చూసినట్లయితే.. లాంగ్ టర్మ్ మూలధన బెనిఫిట్ పై 10 శాతం చొప్పున టాక్స్ ఈ పెట్టుబడిపై వర్తిస్తుంది. ఈ విధంగా, 2.26 లక్షల రూపాయల పన్ను చెల్లించినప్పటికీ, బ్రిజ్‌లాల్‌కు 30.36 లక్షల రూపాయలు మిగిలి ఉంటాయి. ఈ మొత్తంతో కిషోర్ కూతురి చదువు కల నెరవేరనుంది.
మీరు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తుంటే, కిషోర్ చేసిన పొరపాటు చేయకండి. రిటర్న్ వారీగా – పన్నుల పరంగా, ఎఫ్‌డీ పెట్టుబడి మంచి ఎంపిక కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఉంటే, ఒకేసారి పెట్టుబడి పెట్టవద్దు. సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ అంటే STP దీనికి మంచి ఎంపిక. దీనితో, మీరు తక్కువ రిస్క్‌లో మెరుగైన రాబడిని పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు సరైన అవగాహన లేకుంటే, మీరు రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సలహా తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి