
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తన బిట్ కాయిన్ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంటే గతంలో కొన్న బిట్ కాయిన్లు తాజాగా అమ్మేశారు. బిట్‌కాయిన్ పెట్టుబడులను విక్రయించి సుమారు 2.25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20.16 కోట్లు) పొందారు. అయితే ఇంత డబ్బును ఆయన మళ్లీ ఎక్కడ పెట్టుబడి పెడతాడనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్‌లో తెలిపారు.
కొన్నేళ్ల క్రితం కేవలం 6 వేల డాలర్ల(సుమారు రూ.5 లక్షలు)తో బిట్ కాయిన్స్ కొనుగోలు చేశారు. ఒక రకంగా రూ.5 లక్షలు బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వాటిని అమ్మి రూ.20.16 కోట్లు పొందారు. భారీ లాభాన్ని అందుకున్నారు. ఈ విక్రయం గురించి చెబుతూ.. నగదు ప్రవాహాన్ని సృష్టించాలి, ఆ నగదు ప్రవాహాన్ని ఉపయోగించి కొత్త ఆస్తులను కొనుగోలు చేయాలని అని కియోసాకి తెలిపారు.
బిట్‌కాయిన్ అమ్మకం ద్వారా తనకు వచ్చిన డబ్బును రెండు రంగాలలో పెట్టుబడి పెట్టనున్నట్లు కియోసాకి వెల్లడించారు. రెండు సర్జరీ కేంద్రాలను కొనుగోలు చేయడం, బిల్‌బోర్డ్ వ్యాపారం. ఈ పెట్టుబడి వచ్చే ఫిబ్రవరి నుండి నెలకు దాదాపు 27,500 డాలర్లు పన్ను లేకుండా సంపాదిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ కొత్త ఆదాయాన్ని తన మునుపటి రియల్ ఎస్టేట్ ఆదాయాలకు జోడించినప్పుడు, తన మొత్తం నెలవారీ నగదు ప్రవాహం నెలకు లక్షల డాలర్లకు చేరుకుంటుందని ఆయన అన్నారు.
తన పోస్ట్‌లో బిట్‌కాయిన్ పట్ల తనకు నేటికీ అంతే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తన కొత్త ఆదాయంతో మళ్ళీ బిట్‌కాయిన్ కొనడం ప్రారంభిస్తానని ఆయన అన్నారు. రాబర్ట్ కియోసాకి తన పోస్ట్‌లో పెట్టుబడి నుండి ఆదాయాన్ని సృష్టించడం, ఆ ఆదాయాన్ని ఉపయోగించి మరిన్ని ఆస్తులను కొనుగోలు చేయడం వంటి విలువైన విషయాన్ని వెల్లడించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి