
రుతుపవనాలు ముఖం చాటేయడంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వానలు కురవక, వేసిన పంటలు చేతికి రాక రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. అయితే ఇలాంటి గడ్డు కాలంలోనూ పట్టువదలని సంకల్పంతో ముందడుగు వేసిన ఓ రైతు కుటుంబం ఉల్లి సాగులో అద్భుత విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా శ్రమించి, ఏకంగా కోటి రూపాయల దాకా ఆదాయం ఆర్జించి ఆదర్శంగా నిలిచింది. కర్నాటకలోని ధార్వాడ్ జిల్లా సోటకనాల్ గ్రామంలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. గ్రామంలోని పొలాల్లో కనుచూపు మేర ఎర్రటి ఉల్లిపాయ దుంపల రాశులు, గోదాముల్లో బస్తాల కొద్దీ నిల్వలు, ఎండలో ఆరబెడుతూ నాణ్యమైన పంటను వేరు చేస్తున్న కూలీలతో సందడి నెలకొంది. ఈ గ్రామానికి చెందిన రుగీ కుటుంబం తమకున్న దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేపట్టింది. ప్రస్తుతం కోత పనులు చివరి దశకు చేరుకోగా, ఆశించిన మేర నాణ్యమైన దిగుబడి వచ్చింది.
రుగీ కుటుంబానికి గోధుమ, జొన్నలతో పాటు ఉల్లిపాయే ప్రధాన జీవనోపాధి. అయితే వీరి ప్రయాణం అంత సులువుగా సాగలేదు. గత ఏడాది కూడా వీరు 40 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. కానీ అధిక వర్షాలు పంటను ముంచెత్తడం, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూశారు. అయినా అధైర్యపడకుండా అదే నేలలో మళ్లీ ఉల్లి సాగునే నమ్ముకున్నారు. వీరి శ్రమకు తగ్గట్టుగానే ఈసారి ప్రకృతి అనుకూలించడంతో పాటు మార్కెట్లో ఉల్లికి మంచి ధర లభించింది. ఇప్పటివరకు సుమారు 2,500 క్వింటాళ్ల ఉల్లిపాయలను మార్కెట్కు తరలించి, దాదాపు కోటి రూపాయల వరకు స్థూల ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు.
స్ఫూర్తిగా సోటకనాల్ రైతులు
సోటకనాల్ గ్రామస్థులకు ఉల్లి సాగులో ఏళ్ల అనుభవం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావంతో రైతులు దిగాలు పడి ఉంటే, ఇక్కడి రైతులు మాత్రం ఉల్లి సాగుతో చక్కటి లాభాలు గడిస్తున్నారు. రుగీ కుటుంబంతో పాటు గ్రామంలోని పలువురు రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఇంకా పొలాల్లో పంట మిగిలి ఉండటంతో రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎదురైన ఎదురుదెబ్బలకు కుంగిపోకుండా, పట్టుదలతో మళ్లీ సాగు చేపట్టి నేడు కోటీశ్వరులైన రుగీ కుటుంబ ప్రస్థానం అన్నదాతలకు సరికొత్త ఆశలను, స్ఫూర్తిని నింపుతోంది.