మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఛత్రపతి శంభాజీ నగర్ లో ఇటీవల బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు వచ్చాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బజాజ్ కంపెనీ ఈ ఘటనపై స్పందించి విచారణ నిర్వహించింది. ఆ వాహనంలో మంటలు చెలరేగలేదని, దాని ప్లాస్టిక్ కాంపోనెంట్ నుంచి పొగ మాత్రమే వచ్చిందని వెల్లడించింది. ఔరంగబాద్ సమీపంలోని వరవండి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు డిసెంబర్ ఐదున నీటి పైపులను కొనుగోలు చేయడానికి ఛత్రపతి శంభాజీ నగర్ కు తమ బజాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ పై వచ్చారు. రహదారిపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉండగా, వారి వాహనం నుంచి పొగ రావడం మొదలైంది. వెంటనే స్కూటర్ ను పక్కకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న సెవెన్ హిల్స్ ఫైర్ స్టేషన్ కు చెందిన అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వచ్చి వాహనంపై నీరు చల్లారు. బజాజ్ స్కూటర్ నుంచి పొగవెలువడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో పొగలు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ కంపెనీ విచారణకు ఆదేశించింది. డీలర్, కంపెనీ సిబ్బంది వెంటనే ఆ వాహనాన్ని సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లారు. పొగలు రావడానికి కారణాలపై సమగ్రంగా అధ్యయనం చేశారు. స్కూటర్ లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని, ప్లాస్టిక్ భాగం నుంచి మాత్రమే పొగలు వచ్చాయని నిర్దారించారు. బ్యాటరీ, మోటారు చెక్కుచెదరకుండా ఉన్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో బజాజ్ స్కూటర్ వార్త వైరల్ అనంతరం తీసుకున్న చర్యలపై ఆ కంపెనీ ప్రకటన విడుదల చేసింది. పైన తెలిపిన వివరాలను దానిలో సక్రమంగా వివరించింది.
కస్టమర్లకు భద్రత కల్పించడానికి అత్యంత ప్రాధాన్య మిస్తున్నామని, అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్నామని తెలిపింది. బజాజ్ స్కూటర్ల విషయంలో ఎలాంటి అనుమానాలు పడొద్దని ఖాతాదారులకు సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో బజాజ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలకు ఎంతో నమ్మకమైన బ్రాండ్ కావడంతో విక్రయాలు బాగున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ మూడు లక్షల బజాజ్ చేతక్ స్కూటర్లను విక్రయించారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3,800 కంటే ఎక్కువ సర్వీసు సెంటర్లు, ఆన్ రోడ్ సర్వీసు పాయింట్లు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి