IT Notices: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేశాక ఐటీ శాఖ నుంచి నోటీసులు ఎందుకు వస్తాయి?

|

Aug 06, 2023 | 2:45 PM

అసలు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఎప్పుడు వస్తాయి? ఏ సెక్షన్ల కింద ఈ నోటీసులు పంపించారు? ఒకవేళ మీకు కూడా ఇటువంటి నోటీసులు వస్తే ఏమి చేయాలి? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక లక్ష వరకూ నోటీసులు పంపిందని, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనందుకు లేదా తక్కువ ఆదాయాన్ని రిటర్న్స్ లో చూపించినందుకు ఈ నోటీసులను పంపినట్లు చెప్పారు. నోటీసులు వివిధ కారణాల వలన పంపించవచ్చు..

IT Notices: మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేశాక ఐటీ శాఖ నుంచి నోటీసులు ఎందుకు వస్తాయి?
It Notice
Follow us on

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత సుందరం చాలా సంతోషంగా ఉన్నాడు. పెద్ద బరువు దిగిపోయినట్టు అయింది. రిటర్న్స్ ఫైల్ చేసిన తరువాత నుంచి అతను ఐటీ రీఫండ్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ఈలోపు అతనికి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి సుందరం సంతోషం మొత్తం ఎగిరిపోయింది. షాక్ అయ్యాడు. ఆ మెయిల్ ఆదాయపు పన్ను శాఖ పంపించింది. అది ఒక నోటీసు. ఇలా సుందరం ఒక్కడికే కాదు చాలా మందికి ఐటీ శాఖ నోటీసులు పంపించింది. గత అసెస్‌మెంట్ సంవత్సరాల్లో రిటర్న్‌లు ఫైల్ చేయకపోవడంతో ఈ నోటీసులు వచ్చాయి.

అసలు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఎప్పుడు వస్తాయి? ఏ సెక్షన్ల కింద ఈ నోటీసులు పంపించారు? ఒకవేళ మీకు కూడా ఇటువంటి నోటీసులు వస్తే ఏమి చేయాలి? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక లక్ష వరకూ నోటీసులు పంపిందని, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనందుకు లేదా తక్కువ ఆదాయాన్ని రిటర్న్స్ లో చూపించినందుకు ఈ నోటీసులను పంపినట్లు చెప్పారు.

నోటీసులు వివిధ కారణాల వలన పంపించవచ్చు. మొదటి పెద్ద కారణం ఏమిటంటే మీరు కొంత ఆదాయాన్ని చూపించకుండా దాచారు. ఇక రెండవ కారణం, ఐటీఆర్‌ రూపంలో ఏదైనా పొరపాటు జరిగింది. కొన్నిసార్లు కూడిక లేదా తీసివేతకు సంబంధించిన పొరపాట్లు వంటి కొన్ని లెక్కల లోపాలు కూడా ఆదాయపు పన్ను నోటీసులకు దారితీస్తాయి. మీరు టాక్స్ సేవింగ్స్ కోసం తప్పుడు మినహాయింపులు లేదా తగ్గింపులను క్లెయిమ్ చేసినట్లయితే మీకు నోటీసులు అందుతాయి. ఉదాహరణకు, ఇంటి అద్దె అలవెన్స్ అంటే HRA క్లెయిమ్ చేయడంలో మీరు నకిలీ అద్దె రసీదులను జత చేసి ఉండవచ్చు. ఇలా నకిలీ రశీదులను జతచేయడం ఆదాయపు పన్ను నోటీసులను పంపే అవకాశం ఉంటుంది. ఐటీఆన్‌లో చూపించిన ఆదాయం ఫారమ్ 26AS అలాగే వార్షిక సమాచార ప్రకటన అంటే AISతో సరిపోలనప్పుడు కూడా నోటీసులు వస్తాయి. టాక్స్ పెయర్స్ కు చెందిన దాదాపు ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, ప్రాపర్టీ రిజిస్ట్రార్ కార్యాలయాలు అలాగే ఇతర రిపోర్టింగ్ ఏజెన్సీల నుంచి ప్రతి వ్యక్తి లావాదేవీల గురించి డిపార్ట్‌మెంట్ సమాచారం పొందుతుంది. పన్ను చెల్లింపుదారు రిటర్న్‌ను ఫైల్ చేసినప్పుడు, సమాచారం వివిధ రకాలైన సోర్సెస్ నుంచి తీసుకున్న వివరాలతో సరిపోల్చుతుంది. ఇందులో ఏదైనా తేడాలు ఉన్నట్లయితే.. వాటి వివరాలను కోరుతూ పన్ను చెల్లింపుదారుకు నోటీసు పంపిస్తారు.

మీకు ఇమెయిల్, లేదా ఎస్‌ఎంఎస్‌ లేదా పోస్ట్ ద్వారా సుందరం లాగా నోటీసు అందినట్లయితే.. భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు నోటీసులు మీ గురించిన అదనపు సమాచారం కోసం పంపుతారని గుర్తుంచుకోండి. నోటీసు వచ్చిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి సమాధానం ఇవ్వండి. మీరు ఒకవేళ నోటీసులో ఉన్న అంశాలతో ఏకీభవిస్తే.. టాక్స్ చెల్లించండి. నోటీసును మీరు వ్యతిరేకిస్తే.. అంటే మీరు నోటీసులో ఉన్న అంశాలు సరైనవి కావు అని భావిస్తే.. దానిని నిరూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫైనాన్షియల్ రికార్డ్ మొదలైన అన్ని అవసరమైన పత్రాలను సేకరించండి. నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వండి. మీ ప్రత్యుత్తరాన్ని సిద్ధం చేయడానికి మీరు చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకోవచ్చు. మీరు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా నిర్ణయం మీకు అనుకూలంగా లేకుంటే మీరు మీ కేసును కమిషనర్ ముందుకు తీసుకువెళ్ళవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి