మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత నష్టపోతారో తెలుసా..?

మీ ఫోన్ ఇప్పుడు కేవలం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కాదు.. అది మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్, మీ వ్యక్తిగత ఫోటోలు, మీ సోషల్ మీడియా ప్రపంచానికి ఊర కీ లాంటిది. ఆ కీ అపరిచితులు ఓపెన్ చేస్తే మనకు ఎంతో నష్టం వస్తుంది. కాబట్టి ఫోన్ పోయిన వెంటనే ఏం చేయాలంటే..?

మీ ఫోన్ పోయిందా.. 30 నిమిషాల్లో ఈ పని చేయకపోతే మీరు ఎంత నష్టపోతారో తెలుసా..?
What To Do When Phone Is Stolen

Updated on: Jan 13, 2026 | 4:37 PM

ఫోన్ చోరీ అయిన వెంటనే ఎవరైనా షాక్‌కు గురవ్వడం సహజం. కొద్దిసేపు అసలు మైండే పనిచేయదు. ఎందుకంటే మనకు అవసరమైన ప్రతీది అందులోనే ఉంటుంది. కానీ ఆ గందరగోళంలో సమయం వృధా చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ పోయిన వెంటనే మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్థిక రక్షణే మొదటి ప్రాధాన్యత

మీ ఫోన్ లాక్ చేసి ఉన్నా సరే, హ్యాకర్లు దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్‌ను బ్లాక్ చేయించండి. UPI సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ టోకనైజేషన్‌ను నిలిపివేయమని కోరండి. మీ టెలికాం ఆపరేటర్‌కి కాల్ చేసి సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయండి. ఇది అన్నింటికంటే ముఖ్యం ఎందుకంటే OTPలు మీ సిమ్‌కే వస్తాయి. దొంగకు మీ సిమ్ యాక్సెస్ ఉంటే వారు సులభంగా పాస్‌వర్డ్‌లు మార్చగలరు.

డిజిటల్ పాస్‌వర్డ్స్ మార్చండి

బ్యాంకింగ్ సురక్షితం అయ్యాక, మీ డిజిటల్ అకౌంట్లపై దృష్టి పెట్టండి. మరో ఫోన్ నుంచి మీ ప్రైమరీ ఇమెయిల్ పాస్‌వర్డ్ మార్చండి. ఇది అన్ని ఇతర సేవల రీసెట్ కేంద్రం కాబట్టి దీన్ని సేఫ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ డ్రైవ్ వంటి వాటి నుండి రిమోట్ సైన్ అవుట్ అవ్వండి.

పోలీసు ఫిర్యాదు – CEIR పోర్టల్

ఫోన్ దొరుకుతుందనే ఆశ ఉన్నా లేకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆన్‌లైన్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రసీదు తీసుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా, కొత్త సిమ్ తీసుకోవాలన్నా ఇది అవసరం. ప్రభుత్వ పోర్టల్‌లో మీ ఫోన్ IMEI నంబర్‌ను నమోదు చేయండి. దీనివల్ల ఆ ఫోన్ ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయకుండా బ్లాక్ అవుతుంది.

పర్సనల్ డేటా విషయంలో జాగ్రత్త

మీ ఫోన్‌లో ఆధార్, పాన్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ కాపీలు ఉంటే రాబోయే కొన్ని వారాల పాటు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను గమనిస్తూ ఉండండి. మీ ఆఫీస్ మెయిల్స్ ఫోన్‌లో ఉంటే వెంటనే మీ ఆఫీస్ ఐటీ టీమ్‌కు సమాచారం ఇవ్వండి.

ఏం చేయకూడదు?

మీ ఫోన్ దొరికిందని అపరిచితులు పంపే ట్రాకింగ్ లింక్‌లను నమ్మి లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేయకండి. అవి మీ డేటా దొంగిలించే ఫిషింగ్ లింక్స్ కావచ్చు. కాసేపు వెతికి చూద్దాం అని బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ చేయడంలో ఆలస్యం చేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

  • మీ ఫోన్ IMEI నంబర్‌ను ఎక్కడైనా నోట్ చేసి ఉంచుకోండి
  • ఫోన్ లాక్‌తో పాటు ప్రతి పేమెంట్ యాప్‌కు విడిగా App Lock ఉంచుకోండి.
  • అత్యవసర నంబర్లను పేపర్‌పై రాసి వాలెట్‌లో ఉంచుకోండి.

ఫోన్ పోతే తిరిగి కొనవచ్చు కానీ మీ పర్సనల్ డేటా, కష్టపడి సంపాదించిన డబ్బు పోతే తిరిగి రావడం కష్టం. వేగం కంటే స్పష్టమైన నిర్ణయాలే మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి