ఇటీవల కాలంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. వారంలో ఒకటి రెండు సార్లు తగ్గినా.. ఆ తగ్గింపు స్వల్పంగా మాత్రమే ఉంటుంది. పెరిగేటప్పడు ఎక్కువ.. తగ్గేటప్పుడు తక్కువ తగ్గడం సాధారణంగా బంగారం, వెండి ధరల్లో చూస్తుంటాం. గత నెల రోజులుగా భారత మార్కెట్‌లో బంగారం ధరలు రూ.3,500కు పైగా పెరిగాయి. నవంబర్ 1న బంగారం ధర పది గ్రాములు రూ.50,300 కంటే తక్కువగా ఉండగా.. డిసెంబర్ 1న బంగారం ధర రూ.53,900కి చేరింది. ఈ సమయంలో, గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 11 శాతం పెరిగింది. వెండి ధర కూడా ఇదే స్థాయిలో పెరుగుదలను సూచించింది. దీనిని బట్టి చూస్తే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం ధరల తగ్గుదల, పెరుగుదలను అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. అమెరికాలో ద్రవ్యోల్పణ పరిస్థితుల నేపథ్యంలో.. రాబోయే కాలంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో వివాహ ముహుర్తాలు ప్రారంభం అయ్యాయి. జనవరి తర్వాత మరిన్ని ముహుర్తాలు ఉన్నాయి. దీంతో శుభకార్యాలకు, పెళ్లిళ్లకు బంగారం, వెండి వస్తువులు కొనడం ఆనవాయితీ. దీంతో చాలా మంది బంగారం, వెండి ధరలు తగ్గితే.. కొనుగోలు చేద్దామని చూస్తూ ఉంటారు. కాని.. బంగారం ధరలు పెరుగుతూ ఉండటంతో.. తగ్గుతాయనే ఎదురుచూసే వ్యక్తులు నిరాశకు గురికావడం సర్వ సాధారణం.
ప్రధానంగా వివాహల సమయంలో బంగారం, వెండికి డిమాండ్ అధికంగా ఉంటుంది. పండుగలు, వివాహ ముహుర్తాల సమయంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ కనుక.. భవిష్యత్తులో బంగారం, వెండి కొనుగోలు మరింత భారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి