
రైళ్లల్లో అత్యవసరంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అప్పటికప్పుడు టికెట్లు లభించవు. పండుగ సమయాల్లో నెల రోజుల ముందు లేదా సాధారణ రోజుల్లో వారం రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ట్రైన్ జర్నీ చేయాలంటే తత్కాల్ టికెట్లే దిక్కు. ట్రైన్ బయల్దేరడానికి ముందు రోజు ఉదయం వీటిని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. దీంతో వీటికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే అయిపోతాయి. దీని వల్ల చాలామంది తమ ప్రయాణానికి టికెట్లు దొరక్క నిరాశ చెందుతుంటారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వేగంగా బుక్ అవ్వాలంటే ఈ రెండిటిల్లో ఏది మంచిదనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారానే ఈ రెండు పనిచేస్తాయి. రెండింటికి ఒకే తత్కాల్ కోటా ఉంటుంది. వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలంటే పేజీ లోడింగ్, అదనపు స్క్రిప్టులు వంటివి ఉండవచ్చు. అదే యాప్ వేగంగా ఓపెన్ అవ్వడంతో పాటు అదనపు స్క్రిప్టులు వంటివి ఉండవు. దీని వల్ల ఈ రెండింటి మధ్య ఈ స్వల్ప తేడాలు ఉంటాయి. మీరు వేగంగా ఓపెన్ చేయడం, వివరాలు నమోదు, పేమెంట్స్ చేసే ప్రక్రియను బట్టి మీరు టికెట్లను పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రయాణికులు వేగంగా టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ఈ ఏడాది జులైలో కొత్త బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను రైల్వేశాఖ రిలీజ్ చేసింది. క్యాప్చా లేకపోవడం, పాప్‌అప్‌లను తగ్గించడం, బుకింగ్ దశలను కుదించడం, ముందుగా ప్యాసింజర్ల వివరాలు సేవ్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
-తత్కాల్ టికెట్లు ఉదయం 10 ,11 గంటల సమయంలో విడుదల చేస్తారు. దీంతో మీరు బుకింగ్ స్టార్ట్ అవ్వడానికి 5 నిమిషాల ముందే ఐఆర్‌సీటీసీ అకౌంట్లో లాగిన్ అయ్యి ఉండాలి
-తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం రైల్వేశాఖ ఆధార్ ఓటీపీ ధృవీకరణను తప్పనిసరిగా ఉండాలి. దీంతో మొబైల్ సిగ్నల్ సరిగ్గా వచ్చేచోట మీ మొబైల్ ఉంచాలి
-ప్రయాణికుల పేరు, వయస్సు లాంటి వివరాలు ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి
-ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌గా ఉండాలి
-ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల కంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేయడం మంచిది
-ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌లో ముందే నగదు లోడ్ చేసుకుని చెల్లించడం వల్ల మరింత వేగంగా బుక్ చేసుకోవచ్చు