Gold and Silver ETFs: బంగారం, వెండి ధరల జోరు.. వాళ్లకు మస్త్ లాభాలు.. మీరూ ఇలా చేస్తే..

దేశంలోని యువత బంగారం కొనడం కంటే బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం బెటర్ అని అనుకుంటున్నారు. అటు బంగారం, వెండి కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వెండి ETFలు ఏకంగా 42శాతం వృద్ధిని నమోదు చేయగా, బంగారు ETFలు 40శాతం వృద్ధిని సాధించాయి.

Gold and Silver ETFs: బంగారం, వెండి ధరల జోరు.. వాళ్లకు మస్త్ లాభాలు.. మీరూ ఇలా చేస్తే..
Gold And Silver Etfs

Updated on: Sep 13, 2025 | 10:47 AM

గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు, పెరుగుతున్న అప్పులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇదే సమయంలో వెండి ధరలు కూడా పైపైకి పోతున్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్స్, యువత బాగా సద్వినియోగం చేసుకుంటుంది. చాలా మంది బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. భౌతిక బంగారానికి బదులుగా ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని యువత నమ్ముతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు, బంగారం, వెండి ఈటీఎఫ్‌లు రెండూ మంచి రాబడిని అందించాయి. వెండి ETFలు ఏకంగా 42శాతం వృద్ధిని నమోదు చేయగా, బంగారు ETFలు 40శాతం వృద్ధిని సాధించాయి.

బంగారం-వెండి ఈటీఎఫ్‌ల ప్రత్యేకతలు

బంగారం, వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. దీనికి కేవలం డీమ్యాట్ ఖాతా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా మీరు వీటి యూనిట్లను స్టాక్ మార్కెట్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. వెండి ఈటీఎఫ్‌లు బంగారు ఈటీఎఫ్‌ల కంటే కొంత తక్కువ లిక్విడిటీని కలిగి ఉన్నప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది పెద్ద సమస్య కాదు.

దేనిలో పెట్టుబడి పెట్టాలి?

సిల్వర్ ఈటీఎఫ్‌లు 2022లో మార్కెట్లోకి వచ్చాయి. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లు చాలా కాలంగా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలోని అంతర్లీన ఆస్తులు బులియన్ కాబట్టి, మీరు మీ ప్రాధాన్యతలను బట్టి దేనిలోనైనా పెట్టుబడి పెట్టవచ్చు. వీటి రాబడి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం.. వచ్చే ఏడాది నాటికి వెండి ధర కిలోకు రూ.1.5 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బంగారం కూడా మంచి వృద్ధిని సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. మీరు మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఈ రెండింటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈటీఎఫ్‌లు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి.

(Note : ఈటీఎఫ్ లేదా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టేవారు నిపుణులను సంప్రదించి.. అన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత పెట్టుబడులు పెట్టాలి)

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..