
బంగారంపై భారతీయులకు ఉండేది పిచ్చి కాదు. బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా. పిల్లల చదువులకు అవసరం వచ్చినా, వ్యవసాయానికి సాయం కావాలన్నా, ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, ఇల్లు కొనాలన్నా.. ఇలా ప్రతి అవసరానికి తోడుగా ఉండే ఒక శ్రీరామరక్ష. పంట బాగా పండితే రైతు కొనుక్కునేది బంగారమే. అదే పంట పండించడానికి కుదవపెట్టేదీ ఆ మెడలోని బంగారమే. అందుకే, ఆలికి సింగారం-అదనుకు బంగారం అంటుంటారు మనోళ్లు. అలా దేశంలో ప్రజల దగ్గర ఉన్న బంగారం లెక్క చూస్తే.. హా.. అని నోరెళ్లబెడతారు. ఆ నెంబర్ ఎంతో తెలుసా? 2 కోట్ల కేజీల పైమాటే! ప్రపంచంలో ఉన్న బంగారంలో భారత్ దగ్గర ఉన్నది దాదాపు 11 శాతం ఇప్పుడంటే ఉద్యోగ భద్రత కనిపిస్తోంది గానీ ఓ 20, 30 ఏళ్ల క్రితం వరకు ఆ భరోసా ఉండేది కాదు. ఎప్పుడు ఉద్యోగం పోయి జీవితాలు తారుమారు అవుతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో చేయి చాచాల్సిన అవసరం లేకుండా అండగా ఉండేది బంగారమే. కొన్ని గణాంకాల ప్రకారం 2021లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. ఎందుకో తెలుసా. కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. పర్సనల్ లోన్ తీసుకోడానికి అవకాశం లేనివాళ్లంతా మెడలోని తాళిబొట్టును తాకట్టుపెట్టి ఆ రోజులను వెళ్లదీశారు. అందుకే, జీతం పెరిగి, కాస్త కుదురుకున్నాక మొదటి పెట్టుబడి బంగారంలోనే ఉండేది. ఆడపిల్లకు పెళ్లి చేస్తుంటే.. ఎంత బంగారం...