Forex Reserves: భారత సెంట్రల్ బ్యాంక్(Reserve Bank Of India) వద్ద ఫారెక్స్ నిల్వలు భారీగా క్షీణించాయి. గతంలో ఎన్నడూ ఇంత తగ్గుదల నమోదు కాలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో భారతదేశ ఫారెక్స్ నిల్వలు 11.17 బిలియన్ డాలర్లు తగ్గాయి. వారంలో ఈ నిల్వలు అత్యధిక పతనాన్ని(Steep Fall) నమోదు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ తగ్గుదల తరువాత ప్రస్తుతం భారత్ వద్ద 606.475 బిలియన్ డాలర్లకు నగదు నిల్వలు చేరుకున్నాయి. ఇది దేశంలోని ఫారెక్స్ నిల్వల్లో ఎన్నడూ చూడని క్షీణత అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి విలువ పతనం కాకుండా నిరోధించడానికి డాలర్ అమ్మకాల ద్వారా కరెన్సీ మార్కెట్ల్లో RBI జోక్యాన్ని కొనసాగిస్తున్నందున వరుసగా నాలుగో వారం కూడా దేశ ఫారెక్స్ నిల్వలు క్షీణించాయి.
మార్చి 25తో ముగిసిన వారంలో భారత ఫారెక్స్ నిల్వలు 2.03 బిలియన్ డాలర్లు తగ్గి 617.648 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న అధికారిక డేటా ప్రకారం కేవలం గత నాలుగు వారాల్లో ఫారెక్స్ నిల్వలు 26 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించాయి. దీంతో దేశంలోని విదేశీ కరెన్సీ ఆస్తుల్లో అతిపెద్ద తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ 1, 2022తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ కరెన్సీ ఆస్తులు 10.727 బిలియన్ డాలర్లు తగ్గి 539.727 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఫారెక్స్ నిల్వల్లో విదేశీ కరెన్సీ ఆస్తి అతిపెద్ద భాగంగా ఉంటుంది. US డాలర్ పరంగా ఫారెక్స్ నిల్వలను ప్రకటించినప్పటికీ.. వాటిలో యూరో, UK పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి డాలర్ యేతర కరెన్సీల విలువ లేదా తరుగుదల ప్రభావం ఉంటుంది. సమీక్షిస్తున్న వారంలో బంగారం నిల్వల విలువ 507 మిలియన్ డాలర్లు తగ్గి 42.734 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫారెక్స్ నిల్వల్లోని ఇతర రెండు భాగాలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో భారతదేశం ప్రత్యేక డ్రాయింగ్ హక్కుల (SDRలు) విలువ 58 మిలియన్ డాలర్లు పెరిగి 18.879 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 1తో ముగిసిన వారంలో ఐఎంఎఫ్‌లో భారతదేశ రిజర్వ్ స్థానం 4 మిలియన్ డాలర్లు పెరిగి 5.136 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడించాయి.
ఇవీ చదవండి..
Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..
LPG Price: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG ఇప్పుడు భారతదేశంలో..! పూర్తి వివరాలు..