
భారతీయ రైల్వేలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కానీ, ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్ కథ మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడ రైళ్లు ఆగుతాయి, ప్రయాణీకులు వస్తుంటారు, కానీ స్టేషన్ నిర్వహణలో మాత్రం మీకు ఒక్క పురుషుడు కూడా కనిపించడు. అవును, ఇది దేశంలోనే మొదటి ఆల్-విమెన్ రైల్వే స్టేషన్. సాధారణంగా రైల్వే స్టేషన్ అంటే స్టేషన్ మాస్టర్ నుండి క్లీనర్ల వరకు పురుషులే ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ మాటుంగా స్టేషన్‌లో సీన్ రివర్స్. ఇక్కడ మొత్తం 41 మంది సిబ్బంది ఉన్నారు, వీరందరూ మహిళలే.
స్టేషన్ మాస్టర్, బుకింగ్ క్లర్కులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), పాయింట్‌మెన్, సిగ్నలింగ్ సిబ్బంది.. ఇలా ప్రతి విభాగంలోనూ మహిళలే విధులు నిర్వహిస్తారు. ఈ వినూత్న ప్రయోగం 2017 జూలైలో ప్రారంభమైంది. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరని నిరూపించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ అద్భుతమైన కృషిని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్-2018 లో ఈ స్టేషన్ పేరు నమోదైంది. రైల్వే వంటి అత్యంత ఒత్తిడితో కూడిన విభాగంలో కూడా మహిళలు అద్భుతమైన సమన్వయంతో పనిచేయగలరని మాటుంగా స్టేషన్ నిరూపించింది.
ఈ స్టేషన్‌కు వచ్చే ప్రయాణీకులు, ముఖ్యంగా మహిళా ప్రయాణీకులు ఇక్కడ చాలా సురక్షితంగా భావిస్తున్నట్లు చెబుతుంటారు. మహిళా సిబ్బంది ఉండటం వల్ల సమస్యలను చెప్పుకోవడం సులభమవుతుందని, స్టేషన్ చాలా శుభ్రంగా, క్రమశిక్షణతో ఉంటుందని నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.
మాటుంగా స్టేషన్ విజయవంతం కావడంతో ఇప్పుడు దేశంలోని ఇతర నగరాల్లో కూడా (ఉదాహరణకు జైపూర్‌లోని గాంధీనగర్ స్టేషన్) ఇటువంటి ఆల్-విమెన్ స్టేషన్లు ప్రారంభమయ్యాయి. మహిళా సాధికారత దిశగా భారతీయ రైల్వే వేసిన ఈ అడుగు నిజంగా అభినందనీయం.
హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) తన నెట్‌వర్క్‌లో భాగంగా మధురానగర్ మెట్రో స్టేషన్‌ను ఆల్-విమెన్ (All-Women) స్టేషన్‌గా ప్రకటించింది. ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా మహిళా సిబ్బందికే అప్పగించారు. స్టేషన్ మేనేజర్లు, టికెట్ కౌంటర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ విభాగం వరకు అందరూ మహిళలే విధులు నిర్వహిస్తారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..