
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ గ్రాండ్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని వేలాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ సమీపిస్తున్న కొద్దీ విమాన టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం, అలాగే విమాన ఛార్జీలు భారీగా పెరగడం అభిమానులకు పెద్ద సమస్యగా మారింది. చాలా మంది అభిమానులు అహ్మదాబాద్‌కు వెళ్లాలనే ఆశను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిని గుర్తించిన భారతీయ రైల్వే అభిమానులకు పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. నార్త్నర్ రైల్వే న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ (సబర్మతి) వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు మార్చి 7న రాత్రి 11:45 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మొత్తం 19 కోచ్‌లతో నడిచే ఈ రైలులో ప్రధానంగా థర్డ్ AC, సెకండ్ AC కోచ్‌లు ఏర్పాటు చేశారు. దీని వల్ల అభిమానులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా అహ్మదాబాద్ చేరుకునే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో వెస్టర్న్ రైల్వే ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడిపే ఏర్పాట్లు చేసింది.
సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్ బలమైన సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ పోరులోకి వచ్చింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఇదే గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఆ ఓటమి జట్టుతో పాటు యావత్ దేశాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఇప్పుడు ఇదే గ్రౌండ్‌లో మరో ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడనుంది భారత్. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి