
ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే ప్రణాళిక, పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడాన్ని పరిశీలించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, UAE సావరిన్ వెల్త్ ఫండ్‌ను ఆహ్వానించారు.
యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పర్యటన ముగింపు సందర్భంగా ఈ ఒప్పందాలను ప్రకటించారు. భారత పక్షం దీనిని చాలా ముఖ్యమైన పర్యటనగా అభివర్ణించింది. గత దశాబ్దంలో ఇది అల్ నహ్యాన్ ఇండియాలో ఐదవ పర్యటన, యుఎఇ అధ్యక్షుడిగా మూడవ అధికారిక పర్యటన.
ఆయనకు ప్రధాన మంత్రి మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ స్వాగతాన్ని ఇద్దరు నాయకుల మధ్య ఉన్న అత్యంత స్నేహపూర్వక, సన్నిహిత సంబంధాలకు చిహ్నం అని భారత పక్షం అభివర్ణించింది. ఆ తర్వాత ఇద్దరు నాయకులు విమానాశ్రయం నుండి ప్రధాన మంత్రి నివాసానికి కలిసి ప్రయాణించారు. అక్కడ పరిమిత, విస్తృత ఫార్మాట్లలో చర్చలు జరిగాయి. చర్చల సందర్భంగా మోదీ, అల్ నహ్యాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి బోర్డు గురించి చర్చించారు.
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో వేగవంతమైన వృద్ధిని రెండు వైపులా గుర్తించాయి. ఇది 2024-25లో 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. రెండు వైపులా ఉన్న వ్యాపార వర్గాల ఉత్సాహంతో ప్రేరణ పొంది, 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 200 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉమ్మడి ప్రకటన పేర్కొంది. అయితే యూఏఈతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలు చైనా, పాకిస్థాన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్, చైనాకు భవిష్యత్తులో గట్టి పోటీ ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చైనా ఈ ఒప్పందాలపై ఓ కన్నేసి ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మనతో ఏ మాత్రం పోటీ పడలేని పాక్ కూడా ఈ ఒప్పందాల తర్వాత మరింత కన్నీరు పెడుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి