
ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ రంగంలో కీలక విధాన మార్పులు చేపట్టింది. ముడి చమురు, సహజ వాయువు, కేసింగ్ హెడ్ కండెన్సేట్‌లకు సంబంధించిన రాయల్టీ రేట్లు, వాటి లెక్కింపు విధానాలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం దేశీయ ఉత్పత్తిని పెంచి, ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన సంస్కరణగా భావిస్తున్నారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ విషయాన్ని ప్రకటిస్తూ, కొత్త విధానం భారత అప్‌స్ట్రీమ్ ఇంధన రంగానికి కొత్త దిశను చూపుతుందని తెలిపారు. చాలా కాలంగా ఉన్న విధానపరమైన వైరుధ్యాలను తొలగించి, చమురు, గ్యాస్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది సహాయపడుతుందని అన్నారు.
ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఓఆర్డీ చట్టం, పీఎన్జీ నిబంధనల్లో చేసిన సవరణలతో రాయల్టీ విధానం మరింత సరళీకృతమైంది. ఇప్పటి వరకు వివిధ ఒప్పందాల ఆధారంగా మారుతూ వచ్చిన లెక్కింపు విధానాన్ని ఏకరీతిగా మార్చుతున్నారు. దీని వల్ల కంపెనీలకు ముందుగానే తమ చెల్లింపులపై స్పష్టత లభిస్తుంది. విధానపరమైన అనిశ్చితి తగ్గడం ద్వారా దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సులభంగా చెప్పాలంటే, చమురు, గ్యాస్ కంపెనీలు ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి, ఆ మొత్తాన్ని ఎలా లెక్కించాలి అనే విషయంలో కొత్త విధానం స్పష్టత తీసుకువస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోటీతత్వ వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యమని కేంద్రం పేర్కొంది.
ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపుపై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణా వినియోగం పెంచడం, స్వచ్ఛ ఇంధన వనరులను ఉపయోగించడం, అవసరమైతే ఇంటి నుంచే పని చేయడం వంటి చర్యలను ఆయన సూచించారు. కొత్త రాయల్టీ విధానం దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి