
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) దేశీయ వ్యాపారాలకు భారీ అవకాశాలను తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయోజనాలు అన్ని వ్యాపారాలకు ఆటోమేటిక్‌గా అందవని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే తమ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. కోమర్జ్ లిమిటెడ్ గ్లోబల్ సీఓఓగా ఉన్న వాణిజ్య నిపుణుడు సిద్ధార్థ్ శంకర్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం విప్లవాత్మకమైనదే అయినప్పటికీ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేసే సంస్థలకు మాత్రమే పూర్తి స్థాయి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. సుంకాల తొలగింపు ఒక అవకాశాన్ని కల్పించినప్పటికీ, నాణ్యత, సరఫరా గొలుసు క్రమశిక్షణ, సాంకేతికత వంటి అంశాల్లో బలహీనంగా ఉన్న సంస్థలు దానిని పూర్తిగా ఉపయోగించుకోలేవని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం కింద భారతీయ సంస్థలు న్యూజిలాండ్ నుంచి సుంకం లేకుండా ముడిసరుకులు దిగుమతి చేసుకుని, వాటిని ప్రాసెస్ చేసి తిరిగి ఎగుమతి చేసే అవకాశం పొందుతున్నాయి. అయితే భారతదేశంలోని లాజిస్టిక్స్ వ్యవస్థలు, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రేసబిలిటీ, ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాలపై పెట్టుబడి పెట్టకపోతే, ఈ అవకాశాలు పరిమితంగానే మిగిలిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇక పెట్టుబడుల విషయంలో, రాబోయే 15 ఏళ్లలో భారతదేశంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని న్యూజిలాండ్ నిబద్ధత వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే స్టార్టప్‌లు అధికంగా ఈక్విటీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. మూలధనాన్ని యాజమాన్యాన్ని కోల్పోయే సాధనంగా కాకుండా, వృద్ధికి ఉపయోగపడే సాధనంగా చూడాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం కింద భారతీయ నిపుణులకు 5,000 నైపుణ్య వీసాలు, వర్కింగ్ హాలిడే వీసాలు లభించనున్నాయి. ఇది కేవలం ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా, గ్లోబల్ అనుభవాన్ని అందించి దేశ పోటీతత్వాన్ని పెంచే అంశంగా భావిస్తున్నారు. మొత్తానికి ఈ FTA భారతదేశానికి గ్లోబల్ వాణిజ్యంలో కొత్త ద్వారాలు తెరవగలదు. కానీ వాటిని ఉపయోగించుకోవడం వ్యాపారాల సిద్ధత, సాంకేతిక సామర్థ్యం, మరియు వ్యూహాత్మక దృక్పథంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి