వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ డీల్ కుదిరితే.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు..!

భారత్ - యూరప్ మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఫ్రీ ట్రేడ్ డీల్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. డీల్ సెట్ అయితే గ్లోబల్ మార్కెట్ ఆర్డర్‌లో భారత టాప్‌ ప్లేస్‌లోకి రావడం ఖాయం. అంతేకాదు యూరప్‌ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు కూడా భారీగా తగ్గనున్నాయి. ట్రేడ్ డీల్ కుదిరితే ఏ కార్లు చౌక అవుతాయి? ఎవరు లాభపడతారు? ఎవరు నష్టపోతారు? అమెరికా, టెస్లా లాంటి దిగ్గజాలకు భారత్ ఎలాంటి సవాల్ విసరనుంది.?

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ డీల్ కుదిరితే.. భారీగా తగ్గనున్న కార్ల ధరలు..!
India Eu Trade Deal

Updated on: Jan 27, 2026 | 10:50 AM

ఇప్పటివరకు భారత్‌లోకి యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై విధిస్తున్న టాక్స్‌లు ప్రపంచంలోనే అత్యధికం.. సాధారణంగా ఒక యూరోపియన్ కారు భారత్‌లో అడుగు పెట్టేలోపు…మిడిల్‌ రేంజ్ కారు కూడా లగ్జరీ కారు రేంజ్‌లో ధరలు పెరిగిపోతాయి.. ప్రస్తుతం యూరప్‌లో 30 లక్షల కారు, భారత్‌లోకి ఇంపోర్ట్ అయ్యేసరికి 70 లక్షలు ధరతో కొనాల్సి వస్తుంది. దీంతో ఇంపోర్ట్ డ్యూటీ కారణం. మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి, వోల్వో, వోక్స్‌వ్యాగన్ బ్రాండ్ల కార్లు.. చాలా పరిమిత సంఖ్యలోనే అమ్ముడవుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడం కోసం భారత్ భారీ టాక్స్‌లు విధించింది. టాటా, మహీంద్రా, మారుతీ లాంటి కంపెనీలకు పోటీ లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయం.

అయితే భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరితే, కార్లపై దిగుమతి సుంకాల తగ్గిపోతాయి. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పుడున్న 100–110 శాతం టాక్స్‌ను మొదటి దశలోనే 40 శాతం వరకు తగ్గించే ఆలోచనలో ఉంది. తర్వాత దశలవారీగా 10 శాతం వరకు తీసుకెళ్లే ప్రతిపాదన కూడా టేబుల్‌పై ఉంది. అయితే ఇది ఒక్కసారిగా అన్నింటికీ వర్తించదు. ఒక నిర్దిష్ట కోటా వరకు మాత్రమే ఈ తక్కువ టాక్స్ వర్తించే అవకాశం ఉంది.

యూరప్‌లో ఒక మిడ్‌ రేంజ్ కారు 30లక్షల రూపాయలు ఉంటే, అది భారత్‌ వచ్చే సరికి అన్ని టాక్స్‌లు.. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్, IGST, ఇతర సెస్సులు అన్నీ కలిపి 110శాతం టారిఫ్ పడితే, అది లగ్జరీ కారు రేంజ్‌ 65 నుంచి 70లక్షల రూపాయల వరకు ధర పెట్టాల్సి వస్తుంది. అయితే యూరప్‌తో డీల్ కుదిరితే మాత్రం దాదాపు 60శాతం తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే 40శాతం మాత్రం సుంకం పడితే, ఆ కారు ధర 45 నుంచి 50లక్షల రూపాయలకే వచ్చే అవకాశం ఉంది. ఇలా రేటు తగ్గితే కారు ధర అమాంతం తగ్గిపోతుంది.

-మెర్సిడెస్ బెంజ్ C-Classను తీసుకుంటే.. యూరప్‌లో దీని ధర సుమారు 37 లక్షల రూపాయలు. కానీ భారత్‌కు వచ్చేసరికి 110 శాతం ఇంపోర్ట్ డ్యూటీతో దీని ధర దాదాపు 90 లక్షలకు చేరుతోంది. అదే ఈ టారిఫ్ 40 శాతానికి తగ్గితే.. ఈ కారు ధర సుమారు 53 లక్షల రూపాయలకు పడిపోతుంది. ఇక BMW -3 సిరీస్ యూరప్‌లో ధర సుమారు రూ. 42 లక్షలు. ప్రస్తుతం భారత్‌లో ఇది కోటి రూపాయలకుపైగానే ఉంది. 40 శాతం దిగుమతి సుంకం అమలైతే.. కారు ధర 60 లక్షలకు పడిపోతుంది. వోక్స్‌వ్యాగన్ టిగువాన్ యూరప్‌లో సుమారు 36 లక్షలు. 110 శాతం డ్యూటీతో 86 లక్షలుంటే, 40 శాతం అప్లై అయితే.. 51 లక్షల రూపాయలకు తగ్గుతుంది.

వోల్వో XC60 యూరప్‌లో రూ. 52 లక్షల కారు. భారత్‌లో ప్రస్తుతం దీని ధర రూ. 1.23 కోట్లు ఉంటే, డ్యూటీ తగ్గితే.. రూ. 72 లక్షలకే వచ్చేస్తుంది. BMW X1 యూరప్‌లో రూ. 40 లక్షలు. భారత్‌లో రూ. 96 లక్షలు. టారిఫ్ కోతతో సుమారు రూ. 59 లక్షలకు దిగివచ్చే ఛాన్స్ ఉంది. ఆడి Q3 యూరప్‌లో రూ. 37 లక్షల కారు. భారత్‌లో 110 శాతం డ్యూటీతో రూ. 90 లక్షలవుతుంది. అదే 40 శాతం డ్యూటీ అయితే.. సుమారు రూ. 52 లక్షలకే లభిస్తుంది. వోక్స్‌వ్యాగన్ పాసాట్ యూరప్‌లో సుమారు రూ. 36 లక్షలున్న కారు.. భారత్‌లో రూ. 86 లక్షలు పడుతోంది. డ్యూటీ తగ్గితే.. దాని ధర రూ. 51 లక్షల వరకు పడే అవకాశం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. యూరప్ కార్లపై టారిఫ్‌లు తగ్గితే, ఇప్పటివరకు లగ్జరీ సెగ్మెంట్‌లో మాత్రమే కనిపించిన బ్రాండ్లు, మిడిల్ రేంజ్‌ విభాగంలోకి వచ్చేస్తాయి. 15లక్షలకుపైగా ఎక్కువ ధర ఉన్న కార్లకే మొదటి దశలో టారిఫ్ తగ్గింపు ఉండే అవకాశముంది. ఇది కేవలం లగ్జరీ సెగ్మెంట్‌కే పరిమితం కాదు. వోక్స్‌వ్యాగన్, స్కోడా, ఫియట్ లాంటి బ్రాండ్ల మిడ్-సెగ్మెంట్ కార్లు కూడా తగ్గిపోతాయని ఆర్ధిక నిణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..