Hyderabad: హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. ఈ రూట్లో వెళ్లేవారికి తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కాటేదాన్ నుంచి శంషాబాద్ రోడ్ వరకు ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవ్వగా.. త్వరలో నిర్మాణ పనులు మొదలుకానున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్.. ఈ రూట్లో వెళ్లేవారికి తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..
Hyderabad

Updated on: Jun 05, 2026 | 3:17 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి మొగ్గు చూపింది. కొత్తగా నగరంలో ఆరు లైన్ల బై డైరెక్షనల్ గ్రేడ్ సెపరేటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాటేదాన్ నుంచి శంషాబాద్ రోడ్ వరకు మైలార్‌దేవ్ పల్లి మీదుగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. దాదాపు రూ.189.68 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఏజెన్సీ ఎంపిక కోసం ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ శాఖ ఆమోదం తెలిపింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారికి..

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రాక్చర్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. కాటేదాన్, మైలార్‌దేవ్ పల్లి ప్రాంతంలో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది పూర్తయితే స్థానికంగా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేసింది. ఇది పూర్తయితే మూడు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఫ్రీ జర్నీ సదుపాయం లభించనుంది.

టెండర్ల ప్రక్రియ పూర్తి

టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేయగా.. ప్రముఖ కంపెనీ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ ఎంపికైంది. ఈ సంస్థ రూ.189.68 కోట్లకు కోడ్ చేయడంతో అధికారులు ఫైనల్ చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తరచూ వేలాదిమంది వస్తూ ఉంటారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ భారీ వంతెన వల్ల శంషాబాద్ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ రద్దీ లేని ప్రయాణ సౌకర్యం లభించనుంది. అలాగే చంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, బహదూర్ పులా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. కాగా నగరంలో కోటి మందికిపైగా జనం నివసిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుండగా.. ప్రభుత్వం ఎక్కడిక్కడ ఫ్లైఓవర్లను నిర్మిస్తోంది. ఇప్పటికే నగరంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లు ఉండగా.. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

Follow Us