మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందా.. కన్ఫార్మ్ అవుతుందో లేదో ఇలా తెలుసుకోండి..

పండుగలు వచ్చినా, సెలవులు వచ్చినా సామాన్యుడికి గుర్తొచ్చే మొదటి రవాణా మార్గం రైలు ప్రయాణమే. అయితే పీక్ సీజన్లలో కన్ఫర్మ్ టికెట్ దొరకడం చాలా కష్టం. దాంతో చాలా మంది వెయిటింగ్ లిస్ట్‌పైనే ఆశలు పెట్టుకుంటారు. అయితే మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది కొన్ని ట్రిక్స్ ఉపయోగించి ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ విషయాలు తెలుసుకుందాం..

మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందా.. కన్ఫార్మ్ అవుతుందో లేదో ఇలా తెలుసుకోండి..
Which Waiting List Confirms Fast In Indian Railways

Updated on: Jun 21, 2026 | 6:28 PM

మన దేశంలో ఎక్కువ మంది ప్రజల ఫస్ట్ ఛాయిస్ రైలుప్రయాణం. దేశంలో ఏ ప్రాంతానికైన కనెక్టివిటీ, టికెట్ల ధరలు తక్కువ ఉండడమే దీనికి కారణం. రోజూ కోట్ల మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. అయితే పండుగలు, వేసవి సెలవులు, పీక్ సీజన్లలో రైలు టిక్కెట్లు దొరకడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో చాలా మంది వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. కానీ మెజారిటీ ప్రయాణికులు చేసే పొరపాటు ఏంటంటే.. టిక్కెట్ బుక్ అయ్యాక కేవలం వెయిటింగ్ లిస్ట్ నంబర్ మాత్రమే చూసుకుంటారు. వాస్తవానికి.. భారతీయ రైల్వేలలో వెయిటింగ్ లిస్ట్ అంటే కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. అందులో వేర్వేరు కేటగిరీలు ఉంటాయి. మీ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది ఆ నంబర్ కంటే అది ఏ కేటగిరీకి చెందినదనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

జనరల్ వెయిటింగ్ లిస్ట్

రైలు ప్రారంభమయ్యే స్టేషన్ లేదా ప్రధాన స్టేషన్ల నుండి ప్రయాణించే వారికి ఇది కేటాయిస్తారు. కన్ఫర్మేషన్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రైల్వేలలో అత్యధిక సంఖ్యలో సీట్లు ఈ కోటా కిందే ఉంటాయి. కాబట్టి టిక్కెట్ల రద్దు కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి. మీ వెయిటింగ్ నంబర్ కొంచెం ఎక్కువగా ఉన్నా, GNWL కింద కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు మిగతా వాటికంటే చాలా మెరుగ్గా ఉంటాయి.

పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్

రైలు నడిచే మార్గంలో మధ్యంతర స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి ఇది లభిస్తుంది. ఉదాహరణకు: కోల్‌కతా నుండి ఢిల్లీ వెళ్లే రైళ్లో, మధ్యలో ఉండే పాట్నా నుండి లక్నోకు బుక్ చేసుకుంటే ఈ కోటా కిందకు వస్తుంది. ఈ కోటాలో కన్ఫర్మేషన్ అవకాశాలు మధ్యస్థంగా ఉంటాయి. దీనికి కేటాయించిన సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల GNWLతో పోలిస్తే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కొంత తక్కువగానే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్

రైలు మార్గంలో వచ్చే ముఖ్యమైన చిన్న లేదా మారుమూల స్టేషన్ల కోసం రైల్వేలు కేటాయించే ప్రత్యేక కోటా ఇది. ఈ కోటా కింద కన్ఫర్మేషన్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ స్టేషన్లకు పరిమిత సంఖ్యలోనే సీట్లు ఉంటాయి. ఆయా నిర్దిష్ట చిన్న స్టేషన్ కోటాలోనే ఎవరైనా టిక్కెట్ రద్దు చేసుకుంటేనే మీ టిక్కెట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఇందులో సీటు దొరకడం కొంత కష్టమే.

తత్కాల్ వెయిటింగ్ లిస్ట్

అత్యవసర ప్రయాణాల కోసం తత్కాల్‌ కోటాలో బుక్ చేసుకునే క్రమంలో సీట్లు నిండిపోతే TQWL వస్తుంది. కన్ఫర్మేషన్ అవకాశాలు అత్యంత తక్కువ అని చెప్పొచ్చు. తత్కాల్ టిక్కెట్లను రద్దు చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ కోటాలో సీట్లు ఖాళీ కాకపోతే చార్ట్ ప్రిపేర్ అయ్యే చివరి నిమిషం వరకు కూడా కన్ఫర్మ్ కాదు.

ఇతర ప్రత్యేక కోటాలు

RQWL: జనరల్ లేదా పూల్డ్ కోటా వర్తించని ఇంటర్మీడియట్ స్టేషన్ల మధ్య ప్రయాణానికి దీన్ని ఇస్తారు.

SSWL: సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు రద్దయినప్పుడు వీరికి ప్రాధాన్యత దక్కుతుంది.

LDWL : మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కోటాలోని సీట్ల రద్దులపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఒక్కోసారి GNWL లో 40 వెయిటింగ్ ఉన్న టిక్కెట్ కూడా సులభంగా కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ RLWL లేదా TQWL లో కేవలం 5 వెయిటింగ్ ఉన్నా కూడా కన్ఫర్మ్ కాకపోవచ్చు. కాబట్టి వచ్చేసారి మీరు రైలు టిక్కెట్ బుక్ చేసేటప్పుడు కేవలం నంబర్‌నే కాకుండా అది ఏ కేటగిరీకి చెందినదో కూడా ఒకసారి సరిచూసుకోండి. ఇది మీ ప్రయాణం ఖరారవుతుందా లేదా అనే వాస్తవిక అంచనాను ఇస్తుంది.

Follow Us