
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్న వేళ వేతన జీవులు తమ ట్యాక్స్ డాక్యుమెంట్స్ పరిశీలనలో మునిగిపోతున్నారు. అయితే ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు కంటే ముందే పక్కా ప్రణాళికతో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయని, రీఫండ్ కూడా త్వరగా అందుతుందని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. వేతన జీవులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఉద్యోగులకు కంపెనీలు జూన్ 15 నాటికి ఫామ్-16ను జారీ చేయడం తప్పనిసరి. ఉద్యోగుల ఐటీ రిటర్న్ ప్రక్రియలో సింహభాగం పనిని ఈ పత్రమే ఈజీగా మారుస్తుంది.
పార్ట్-A: సంస్థ మీ జీతం నుంచి మినహాయించి, ప్రభుత్వానికి జమ చేసిన టీడీఎస్ వివరాలను చూపుతుంది.
పార్ట్-B: మీ స్థూల జీతం, వివిధ అలవెన్సులు, సెక్షన్ 80C కింద ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్న మినహాయింపుల వివరాలు ఇందులో ఉంటాయి.
ఆదాయపు పన్ను పోర్టల్‌లోకి లాగిన్ అవ్వగానే.. e-File విభాగంలో లభించే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌తో ఫామ్-16ను తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. ఫామ్-16లో ఉన్న టీడీఎస్‌కు, ఏఐఎస్‌లోని వివరాలకు వ్యత్యాసం ఉంటే ప్రాసెసింగ్‌లో జాప్యం జరిగి రీఫండ్ ఆలస్యమవుతుంది. అలాగే సేవింగ్స్ ఖాతా వడ్డీ వివరాలు, హోమ్ లోన్ సర్టిఫికెట్, హెచ్‌ఆర్‌ఏ రసీదులు సిద్ధం చేసుకోవాలి. ఏడాదికి రూ.10,000 దాటిన సేవింగ్స్ వడ్డీ ఆదాయాన్ని చూపించకపోతే తర్వాత ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
సరైన ఫామ్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకం.
ఐటీఆర్-1 : జీతం ద్వారా మాత్రమే ఆదాయం ఉండి, ఒకే ఇల్లు, సేవింగ్స్ వడ్డీ కలిగిన వారు, అలాగే వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉన్నవారు ఈ ఫామ్‌ను ఉపయోగించాలి. వ్యాపారం, విదేశీ ఆస్తులు, మూలధన లాభాలు ఉండకూడదు.
ఐటీఆర్-2: గత ఆర్థిక సంవత్సరంలో షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ విక్రయించి మూలధన లాభాలు పొందినట్లయితే ఐటీఆర్-2 ఎంచుకోవాలి.
తప్పుడు ఫామ్ ఎంచుకుంటే ఆ రిటర్న్‌ను లోపభూయిష్టమైనదిగా పరిగణించి శాఖ నుంచి నోటీసులు వస్తాయి.
చాలామంది సెక్షన్ 80C పరిమితి రూ.1.5 లక్షలకు మాత్రమే పరిమితమవుతారు. అయితే పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు క్లెయిమ్ చేసుకోదగిన మరికొన్ని కీలక మినహాయింపులు.
సెక్షన్ 80D: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై గరిష్టంగా రూ.25,000 మినహాయింపు పొందవచ్చు.
సెక్షన్ 80TTA: పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీలో రూ.10,000 వరకు మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్ 24(b): హోమ్ లోన్‌పై చెల్లించే వడ్డీకి గరిష్టంగా రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.
స్టాండర్డ్ డిడక్షన్: వేతన జీవులందరికీ రూ.50,000 స్థిర మినహాయింపు వర్తిస్తుంది.
గమనిక: కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, 80C, 80D వంటి పలు మినహాయింపులు వర్తించవు. పోర్టల్‌లోని క్యాలిక్యులేటర్ ద్వారా రెండింటినీ సరిపోల్చుకుని తగిన విధానాన్ని ఎంచుకోవచ్చు.
ఆడిట్ అవసరం లేని వేతన జీవులకు ప్రతి ఏడాది ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి గడువు జూలై 31గా ఉంటుంది. చివరి వారాల్లో పోర్టల్ ట్రాఫిక్ సమస్యలు, సర్వర్ డౌన్ వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తుగానే రిటర్న్స్ పూర్తి చేసుకోవడం మంచిది. ఒకవేళ సెక్షన్ 143(1) కింద ఏవైనా నోటీసులు లేదా వ్యత్యాసాలు ఎదురైతే 30 రోజుల్లోపు పోర్టల్ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం లభిస్తుంది.