Gold: అన్‌బీటబుల్‌ గోల్డ్‌ రిజర్వ్స్‌.. భారతీయుల ఇళ్లల్లో బంగారం ఎంతుందో తెలిస్తే మతి పోతుంది..

విదేశీయులకు గోల్డ్‌ అంటే అదో ఎల్లో మెటల్. మన దగ్గర మాత్రం పుత్తడిని మహాలక్ష్మిలా కొలుస్తుంటాం. ప్రత్యేకించి బంగారం కొనడానికే అక్షయ తృతీయను సృష్టించుకున్నవాళ్లం మనం. ఆ రకంగానైనా ఇంటికి కాసు బంగారం వస్తుందనే ఆశతో. అలా.. ఇంటి ఇల్లాలు జాగ్రత్త చేయబట్టే ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం ఇండియాలోనే పోగుపడింది. రిజర్వ్‌బ్యాంకుల్లో కాదు.. భారతీయుల ఇళ్లల్లో.

Gold: అన్‌బీటబుల్‌ గోల్డ్‌ రిజర్వ్స్‌.. భారతీయుల ఇళ్లల్లో బంగారం ఎంతుందో తెలిస్తే మతి పోతుంది..
Gold
Follow us

|

Updated on: Nov 06, 2024 | 6:40 AM

పరుసవేది అంటే తెలుసా. ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అయిపోతుంది అనే మాటకు అర్థం అది. ఒకప్పుడు భారతదేశాన్ని పరుసవేది అని పిలిచేవారు. ‘అక్కడ ఏది ముట్టుకున్నా బంగారంరా’ అనేవాళ్లు. నిజంగా బంగారమే మన జంబూద్వీపం. అటు ఇరాన్‌ నుంచి ఇటు ఇండోనేషియా దాకా అంతా ఒకే సామ్రాజ్యం. ఆ రోజుల్లో ఇండియాను టచ్‌ చేస్తే చాలు.. వాళ్లు ఎంతో గొప్పోళ్ల కింద లెక్క. ‘ఏంటీ నువ్వు భారతదేశాన్ని తాకి వచ్చావా, ఏదీ నిన్నొకసారి తాకని’ అని అదో అద్భుతంగా చూసేవాళ్లు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉత్పత్తి అయ్యే బంగారం అంతా మనదేశానికే వచ్చి చేరేది. వచ్చి పడే ఆ బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు మనకి. ఆభరణాలు తయారుచేసుకున్నారు. ఒంటి నిండా బంగారం వేసుకున్నారు. ఏడువారాల నగల పేరుతో ఆడవాళ్లు అలంకరించుకున్నారు. అయినా సరే.. వచ్చి పడుతూనే ఉంది బంగారం. ఆలయాలకు టన్నుల కొద్దీ బంగారాన్ని కానుకగా ఇచ్చేవారు. ఖజానాలు, నేలమాళిగలు నిండుతున్నాయి గానీ.. బంగారం రాక ఆగలేదు భారతదేశానికి. ఇలా కాదని ఆ దేవుడినే బంగారు విగ్రహాలుగా మలిచారు. ఆ విగ్రహాలను బంగారంతో అలంకరించుకుని చూసుకున్నారు. అయినా బంగారం నిల్వలు తరిగితేగా.. వస్తూనే ఉంది బంగారం. గుడి గోడల నుంచి ఆలయ శిఖరం వరకు బంగారు తాపడాలు చేసేశారు. ఒంటి మీద వేసుకున్న బంగారం చాలదన్నట్టు చీర జరీ అంచుల్లో కూడా బంగారం పెట్టి.. ఇంటి ఇల్లాలి ముఖంలో ఆనందం చూశారు. అంత బంగారం. అసలు భారతదేశం అంటేనే బంగారం.

సరే.. ఇంతకీ ఈ బంగారం ఎందుకొచ్చింది మన దేశానికి. ప్రపంచ నలుమూలల నుంచి ఒక్క భారతదేశానికే బంగారం ఎందుకు వచ్చేది? ‘లక్షాధికారి అయినా లవణమన్నమే గానీ.. మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అంటారు కవి శేషప్ప. అంటే.. కోట్లకు పడగలెత్తినవారైనా అన్నమే తింటారు తప్ప బంగారం తినలేరు అని అర్ధం. భారతదేశం విషయానికొస్తే.. మన దగ్గర పండే ప్రతి గింజ బంగారమే. బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలు, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలు, పత్తి.. ఇలా ఒకటేమిటి పండనిదంటూ లేదు మన భారతదేశంలో. ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆహార ఉత్పత్తి మన దగ్గరే. సిరిసంపదలంటే బంగారం, వజ్రవైఢూర్యాలు, మాణిక్యాలు కాదు.. ధాన్యలక్ష్మే ధనలక్ష్మి అని నమ్మిన దేశం మనది. వేరే దేశాల్లో బంగారం ఉత్పత్తి అయ్యేది.. మన దగ్గర ధాన్యం పండేది. ఇందాక చెప్పుకున్నాం కదా.. లక్షాధికారి అయినా తినాల్సింది అన్నమే గానీ బంగారం కాదని. కాసిన్ని తిండి గింజిలిస్తే చాలు బోలెడంత బంగారం పోసి పోయేవాళ్లు విదేశీయులు. వాళ్ల దగ్గరున్న బంగారాన్ని మనకిచ్చి వాళ్లకు కావాల్సిన ఆహార ధాన్యాలు, వస్త్రాలు తీసుకెళ్లే వాళ్లు. అలా పోగుబడిన బంగారానికి లెక్కే లేదు. అందుకే, పరుసవేది అని చెప్పుకున్నది. ‘అక్కడ ఏది ముట్టుకున్నా బంగారంరా’ అని చెప్పుకున్నాం కదా. దాని అర్ధం ఇదే. పిడికిడంత బియ్యానికైనా సరే.. బంగారం ఇచ్చేవాళ్లు. మనదగ్గర ఏది ముట్టుకున్నా బంగారమే చేతిలో పెట్టి వెళ్లేవాళ్లు.

మరి అంత బంగారం ఏమైపోయింది? ఇప్పుడు కనిపించట్లేదేం ఆ బంగారు గుట్టలు? అడగాలనిపిస్తోంది కదూ. ఒకటి కాదు రెండు కాదు.. 200 ఏళ్ల పాటు దోచుకుంటూ పోతే గానీ తరిగిపోలేదు మన దగ్గర ఉన్న సంపద. మన బంగారం, మన సిరిసంపదలను దోచుకోడానికి వాళ్లకి 200 ఏళ్లు పట్టిందంటే.. ఎంత సంపన్న దేశం మనది. బ్రిటిషర్స్‌ మాత్రమే కాదుగా.. అంతకు ముందు విదేశీయులు, మొఘల్స్‌ భారతదేశం నుంచి లెక్కలేనంత బంగారాన్ని కొల్లగొట్టారు. గజినీ మహ్మద్ లాంటి వాళ్లు సోమనాథ్ ఆలయంపై దండెత్తి కిలోలకు కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. మనకు స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు. అప్పటికే వాళ్లు దోచుకోవడం మొదలుపెట్టి కనీసం 300 ఏళ్లు అయింది. అందుకే, మన ఘనచరిత్ర చాలామందికి తెలీదు, అప్పటి సంపద ఇప్పుడు కనిపించదు. అయినా సరే.. ఆ స్థాయిలో దోచుకున్నా సరే.. ఇప్పటికీ భారతీయుల దగ్గరున్న బంగారమే ఎక్కువ. అన్‌బీటబుల్‌ గోల్డ్‌ రిజర్వ్స్‌. అమెరికా గొప్ప, చైనా గొప్ప, జపాన్‌ గొప్ప అంటుంటాం గానీ.. ఈ విషయంలో భారతదేశమే గొప్ప. Can anyone guess. మన దగ్గర ఎంత బంగారం ఉండొచ్చో అంచనా వేయగలరా. ఆల్‌మోస్ట్‌.. 2 కోట్ల కేజీల బంగారం. ఓ అంచనా ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 2 కోట్ల 30 లక్షల కిలోల బంగారం ఉంది.

అమెరికా దగ్గర ఉన్న బంగారం నిల్వలు 8133 టన్నులు. కిలోల్లో చెప్పాలంటే.. 81 లక్షల 33వేల కిలోలు. భారతదేశంలో ఉన్న 2 కోట్ల కేజీల బంగారానికి అమెరికా కనీసంలో కనీసం కూడా సరితూగలేదు. ఒక్క అమెరికా ఏంటి? చైనా, రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఐఎంఎఫ్.. ఇలా దేశాల దగ్గరున్న బంగారాన్నంతా పోగుచేసి, త్రాసులో వేసినా.. భారతీయుల దగ్గరున్న బంగారాన్ని మ్యాచ్‌ చేయలేరు. సరే.. అఫీషియల్‌గా చెప్పే లెక్కలను బట్టి ప్రభుత్వాల రిజర్వ్‌బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వల్లో అమెరికానే టాప్. ఆ విషయంలో ఇండియా ఐదో స్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8133 టన్నులు, రష్యా దగ్గర 2335 టన్నులు, చైనా దగ్గర 2264 టన్నులు, జపాన్‌ దగ్గర 846 టన్నులు, ఇండియా దగ్గర 840 టన్నుల గోల్డ్‌ రిజర్వ్స్‌ ఉన్నాయి. 2009లో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏకంగా 200 టన్నుల బంగారం కొనేసింది. 200 టన్నులు అంటే 2 లక్షల కిలోల బంగారం. 1991 ఆర్థిక సంక్షోభంలో బంగారం తాకట్టుపెట్టి అప్పు తెచ్చుకున్న భారతదేశం.. 20 ఏళ్లు తిరక్కుండానే అమాంతం 2 లక్షల కిలోల బంగారం కొనడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంటే.. డబ్బు లేనప్పుడు తాకట్టు పెట్టింది బంగారాన్నే. కాస్త చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొన్నదీ బంగారాన్నే.

విదేశీయులు మనవాళ్లలా బంగారు ఆభరణాలు వేసుకుని తిరగరు. కొందరు అనొచ్చు.. బంగారం అంటే భారతీయులకి పిచ్చి అని. కాదు. మనది పిచ్చి కాదు. అదొక ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్. ఆర్థిక సంక్షోభం వస్తే అమెరికన్లు గిలగిల తన్నుకుంటారు. వెంటనే అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగి.. వడ్డీరేట్లు సున్నాకు చేరుస్తుంది. ‘తీసుకోండి.. కావాల్సినంత అప్పు తీసుకోండి.. బతకండి’ అంటుంది. అలా జరిగింది కూడా. కాని, మన దగ్గర అలా ఎప్పుడైనా జరిగిందా? అంతటి సంక్షోభం మన భారతీయులకు వచ్చిందా? రాలేదు. ఎందుకని రాలేదు..? బతుకుపై భయాన్ని పోగొట్టే ఒక భరోసా మన దగ్గర ఉంది కాబట్టి. అదే బంగారం. పేదవాళ్లైనా సరే.. పెళ్లప్పుడు ఆడపిల్ల మెడలో రెండు కాసుల బంగారం వేసి పంపుతారు మన దగ్గర. ‘ఆలికి సింగారం.. అవసరానికి బంగారం’ అనే నానుడి అలా పుట్టిందే. కుటుంబానికి కష్టమొస్తే.. మెడలోని బంగారం తీసి ఇస్తుంది ఇల్లాలు. మరొకరి దగ్గర చేయి చాచనివ్వకుండా. అసలు ‘కొంగు బంగారం’ అనే మాట అక్కడి నుంచి వచ్చిందేగా. ‘కొంగు బంగారం’ అంటే చాలా మందికి అర్థం తెలియకపోవచ్చు. పది గ్రాములైనా, వంద గ్రాములైనా చీర కొంగుకు కట్టి తీసుకెళ్తుంది ఇల్లాలు. అలా చీర కొంగులో కట్టుకెళ్లిన బంగారంతో తన కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీరుస్తుంది. అమ్మినా, కుదువ పెట్టినా వెంటనే డబ్బు చేతికి అందుతుంది. మరే వస్తువుకు లేనంత గిరాకీ ఒక్క బంగారానికే ఉంటుంది. అందుకే, బంగారం అంటే మనకు పిచ్చి కాదు. అదొక ఆర్థిక అవసరం. నడిచే ఆస్తి అది. పంట బాగా పండితే రైతు కొనేదీ బంగారమే. ఎందుకో తెలుసా.. రేప్పొద్దున పంట చేతికి రాకపోయినా, మళ్లీ సాగుకు పెట్టుబడి పెట్టాలన్నా కుదవపెట్టాల్సింది ఆ బంగారమే కాబట్టి. వ్యవసాయానికైనా-చదువులకైనా, ఇల్లు కొనాలన్నా-ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా.. అవసరానికి తోడుగా ఉండేది ఆ బంగారమే. అందుకే, బంగారం అంటే మనకి మోజు కాదు పిచ్చి అంతకంటే కాదు. అదొక క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్. భారతదేశంలో 6 లక్షల 50 వేల గ్రామాలు ఉంటే.. 36వేల గ్రామాల్లో మాత్రమే బ్యాంకుల బ్రాంచులు ఉన్నాయి. వాళ్లంతా డబ్బును దాచుకోవడం కంటే.. బంగారంలోనే మదుపు చేస్తున్నారు. ఎందుకంటే.. బంగారం అంటే భద్రత కాబట్టి.

కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లకల్లోలం అయింది. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. భారతదేశంలో కూడా. కాని, అందరికీ పర్సనల్ లోన్‌ తీసుకునే అవకాశం ఉండదుగా. మరి ఆ ఏడాది, ఏడాదిన్నర పాటు ఎలా బతకగలిగారు. మళ్లీ ఎలా చేయి తిప్పుకోగలిగారు? కారణం.. బంగారమే. కొన్ని గణాంకాల ప్రకారం 2021లో గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగాయి. తాళిబొట్టును సైతం తాకట్టుపెట్టి ఆ రోజులను నెట్టుకొచ్చారు. కాస్త జీతం పెరిగి, చేతిలో డబ్బు మిగిలితే ఎవరైనా సరే కొనేది బంగారమే. ఎందుకంటే, ఆ ఉద్యోగమే పోయిననాడు పరువు నిలబెట్టేది అదే కాబట్టి. అందుకే, బంగారమేం మనకు పిచ్చి కాదు. అదొక శ్రీరామరక్ష. ఆడపిల్ల పెళ్లి అనగానే.. ‘ఎంత బంగారం పెడుతున్నారేంటి’ అని అనేస్తుంటారు. కట్నమా, డౌరీనా.. నాన్సెస్‌ అంటారు గానీ.. ఆడపిల్లతో పాటు బంగారం కూడా ఇచ్చి పంపితే బతుకు భద్రంగా ఉంటుందన్న నమ్మకం తల్లిదండ్రులది. అందుకే, బంగారం అంటే భారతీయులకు అంత ఇష్టం. పైగా ఎన్నేళ్లైనా పాడవని వస్తువు ఇది. భద్రపరచడం కూడా సులభమే. అంటే.. దొంగల భయం ఉండదని కాదిక్కడ అర్థం. ఫ్రిజ్‌లో పెడితేనే ఉంటుందనో, పాదరసంతో మిక్స్ చేస్తేనే నిలుస్తుందనో ఝంఝాటాలు లేవు. బీరువాలోనో, లాకర్లలోనో పెడితే ఏళ్లు గడిచినా అలా ఉండిపోతుందంతే. ప్రపంచంలో ఎక్కడైనా సరే.. బంగారం ఇస్తే.. ఆ రోజుకు తగ్గ డబ్బు చేతిలో పడుతుంది.

కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేది బంగారమే. ఆ కష్టం తీరినప్పుడు దేవుడికి భక్తిపూర్వకంగా ఇచ్చేదీ బంగారమే. అలా భక్తితో దేవుడికి సమర్పిస్తున్న బంగారానికి లెక్కే లేదు. రాజుల కాలం నుంచి ఓ సంప్రదాయంగా వస్తోందిది. తిరుమల వేంకటనాథునికి 11వేల 329 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయి. 2023లో.. ఒక్క ఏడాదిలోనే 1031కిలోల బంగారం వచ్చింది. కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 1300 టన్నుల బంగారం ఉంటుందని ఓ అంచనా. తిరుమల సహా దేశంలోని అన్ని ఆలయాల్లో ఉన్న బంగారాన్ని లెక్కిస్తే 2500 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పసిడి విలువ తెలుసు కాబట్టే కదా.. బంగారం కొని, దాన్ని బిస్కెట్లుగా మార్చి, చాలా జాగ్రత్తగా ఖజానాలో దాచుకుంటున్నాయి దేశాలు. ఏ దేశానికైనా సరే.. ఆర్థిక సంక్షోభం వస్తే గట్టెక్కించేది బంగారమే. 1991లో అలాంటి సంక్షోభమే భారతదేశానికి వచ్చినప్పుడు.. బంగారంతోనే గట్టెక్కించారు. బంగారం ఇచ్చి డాలర్లు తీసుకుని, దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టుకున్నారు. ‘ఓ డాలర్లు’ అంటూ వెంటపడతారు గానీ.. ప్రపంచ మార్కెట్లో ఆ డాలర్‌కు విలువ పడిపోతే అవి చిత్తు కాగితాలతో సమానం. మరి మన కరెన్సీ అంత గొప్పదా, విలువ పడిపోతే ఇండియన్ రూపీ చిత్తు కాగితం కాదా? కానే కాదు. మీరు చూసే ఉంటారు. రూపాయి కాగితం మీద కూడా రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంతకం ఉంటుంది. ఎందుకని? ఒకవేళ ఆ రూపాయి చెల్లకపోతే.. ఆ విలువకి సమానంగా బంగారం ఇస్తుంది కాబట్టి. కాని, డాలర్‌ నోటుకి ఆ గ్యారెంటీ లేదు. అందుకే, డాలర్‌ విలువ పడిపోతే.. ప్రపంచం వణికిపోతుంది. డాలర్‌ ఎప్పటికీ నిలిచి ఉంటుంది, దాని విలువ తగ్గదు అనే నమ్మకంతో.. ప్రపంచ దేశాలన్నీ డాలర్లలో పెట్టుబడులు పెట్టాయి. చైనా అయితే ఏకంగా 3 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులను అమెరికా ట్రెజరీ బాండ్స్‌లో పెట్టింది. డాలర్‌ విలువ పతనమైతే చైనా పని ఔట్. ఒక్క చైనానే కాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలుతాయి. అలాంటి సమయంలో వన్నెతరగని, విలువ కరగని ఒకే ఒక్క ఆస్తి.. బంగారం. అందుకే, బంగారాన్ని నిల్వ చేసుకుంటాయి దేశాలు. డాలర్‌ విలువ తగ్గితే.. గోల్డ్‌ విలువ పెరుగుతుంది. కారణం.. డాలర్‌ బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి గోల్డ్‌ను కాస్త తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అలా దేశాలు ఎప్పుడైతే బంగారం కొంటాయో ఆటోమేటిక్‌గా పసిడి డిమాండ్‌ పెరుగుతుంది. డాలర్‌ విలువ గనక విపరీతంగా పెరుగుతుందనుకోండి. గోల్డ్‌ కొనడం తగ్గించేస్తారు. డాలర్‌ విషయంలో ఈ అప్‌ అండ్‌ డౌన్స్‌ ఎప్పుడూ ఉంటాయి. అందుకే, ఓ స్టెబిలిటీ కోసం బంగారం కొంటాయి దేశాలు.

ఏమాటకామాటే.. గోల్డ్‌ రేట్‌ దారుణంగా పెరుగుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 37 సార్లు కొత్త రికార్డులు సృష్టించింది. అంటే.. గోల్డ్‌ రేట్‌ ఆల్‌టైమ్‌ హైకి చేరడం, తగ్గడం.. మళ్లీ ఆల్‌టైమ్‌ హైకి పెరగడం.. ఇలా 37 సార్లు సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. పైగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్న అనుమానాలు నెలకొన్నాయి. క్రూడ్ ధరలు విపరీతంగా పెరిగే ఛాన్స్‌ ఉంది. మళ్లీ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవొచ్చు. ఈ మధ్యలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. స్టాక్‌మార్కెట్లో ఊగిసలాటలు తప్పకపోవచ్చు. అంటే.. బంగారం ధర ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ఛాన్స్‌ లేదు. మరి బంగారం రేటు పెరుగుతోంది కదా.. కొనడం తగ్గిస్తారా మనవాళ్లు..? నెవ్వర్. రేటు ఎంత పెరిగినా.. కొంటూనే ఉంటారు. పది గ్రాముల బంగారం ధర పాతికవేలు దాటినప్పుడు ‘అమ్మో 25వేలా’ అన్నారు. కొనడం ఆపలేదుగా. చూస్తుండగానే 50వేలు దాటింది. రేటు పెరిగింది కదా అని తగ్గలేదుగా. 60వేలు, 70వేలు దాటింది. అయినా ఆపడం లేదుగా. దసరా ముగిసే నాటికి పది గ్రాముల పసిడి ధర 82వేలు టచ్‌ చేస్తుందని స్వయంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. సరిగ్గా అదే జరిగింది కూడా. సమీప భవిష్యత్తులో అదే పది గ్రాముల పుత్తడి లక్ష రూపాయలు అవొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయినా సరే.. బంగారం కొనుగోళ్లు ఆగవు మనదగ్గర. ఒకప్పుడు 25వేలు ఉన్న బంగారం విలువ ఆ తరువాత రెండింతలు, మూడింతలు పెరిగింది. ఇప్పుడు 82వేలు అంటున్నారు, రేప్పొద్దున లక్షకు టచ్‌ చేయొచ్చంటున్నారు. అంటే.. కొన్న బంగారం విలువ పెరుగుతున్నట్టే కదా. అందుకే, బంగారం కొనడం ఆపరు మనవాళ్లు.

బంగారంతో భారతీయుల అనుబంధాన్ని విడదీయడం అసాధ్యం. అందుకేగా.. బంగారం దిగుమతుల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోంది మనం. 2023 ఆర్థిక సంవత్సరంలో 41.88 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. 2024 ఆర్థిక సంవత్సరం ముగియలేదు గానీ.. ఆల్రడీ 78.95 మెట్రిక్ టన్నుల చేరుకుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి ఈ ఏడాది 160 టన్నుల బంగారం దిగుమతి చేసుకోవాలనుకుంటోంది భారత్. దీనికి తోడు ఇండియాలో ఇంపోర్ట్‌ డ్యూటీ తగ్గించారు. ఆ కారణంగా.. ఒక్క ఈ ఆగస్ట్‌ నెలలోనే బంగారం దిగుమతి 221.41 శాతం పెరిగింది. జులైలో 3 బిలియన్‌ డాలర్లు పెట్టి బంగారం కొన్న భారతదేశం.. ఆగస్ట్‌లో మాత్రం ఏకంగా 10 బిలియన్‌ డాలర్లు పెట్టి బంగారం దిగుమతి చేసుకుంది. సో, బంగారం దిగుమతులు ఆగవు, రేటు పెరిగినా బంగారం కొనడమూ ఆపరు. అయితే.. బంగారం కొనడం, దాచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదన్న అభిప్రాయం ఉంది ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్స్‌లో. వందల కోట్లు పెట్టి బంగారం కొని, లాకర్లలో దాస్తే.. దానివల్ల ప్రొడక్టివిటీ ఉండదు. అదే వందల కోట్లు పెట్టి ఓ ప్రాజెక్టో, కంపెనీనో పెడితే.. ఉద్యోగాలొస్తాయి, ప్రజలకు మేలు జరుగుతుంది, దేశ అభివృద్ధికీ కారణం అవుతుంది. అందుకే, ప్రొడక్టివిటీ లేని బంగారం కొనడం వల్ల రిజర్వ్‌ బ్యాంకులకు పెద్దగా ఒనగూరే లాభం లేదని చెబుతుంటారు. ఆ కారణంగానే బంగారం దిగుమతులను తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. బట్.. వర్కౌట్‌ కాలేదు. ఇక చేసేది లేక.. ఆర్థిక సంక్షోభం వేళ దేశాన్ని ఆదుకుంటుందనే ఉద్దేశంతో ఇండియా కొంటోంది, ఇతర దేశాలూ కొనేస్తున్నాయి.

భారతీయులకు బంగారం అంటే మొన్నటి దాకా నగలు కొనడమే. ఇప్పుడు గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కూడా పెరుగుతున్నాయి. గోల్డ్‌ను పొదుపు, పెట్టుబడి సాధనంగా చూడ్డం మొదలుపెట్టారు భారతీయులు. అందుకే, బంగారంలో పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 2022లో భారతదేశంలోని 15 శాతం కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. 2023లో ఆ సంఖ్య 21 శాతానికి పెరిగింది. పైగా రాబడి కూడా బాగుంటోంది. భవిష్యత్తులో బంగారాన్ని పెట్టుబడి సాధనంగా మార్చుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి