
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేయగానే.. డెలివరీ బాయ్ మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాడు. డెలివరీ బాయ్‌కు మీరు టిప్ రూపంలో ఎంతోకొంత ఇస్తూ ఉంటారు. రూల్స్ ప్రకారం డెలివరీ బాయ్‌కు అదనంగా ఎటువంటి రుసుం ఇవ్వాల్సిన పని లేదు. మీరు చెల్లించే బిల్లులోనే డెలివరీ ఛార్జీలు కలిపి ఉంటాయి. అయినా డెలివరీ బాయ్ డిమాండ్ చేయడంతో చాలామంది అదనంగా ఇస్తూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? డెలివరీ బాయ్‌కు జీతం ఎంత ఉంటుంది..? ఒక్కో గ్యాస్ డెలివరీ చేసినందుకు ఎంత కమిషన్ వస్తుంది? ఒక్కొ సిలిండర్‌పై గ్యాస్ ఏజెన్సీకి ఎంత కమిషన్ వస్తుంది..? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ ఇంటింటికి డెలివరీ చేసే కార్మికులకు ప్రాథమిక జీతంతో పాటు ప్రతి సిలిండర్ డెలివరీపై కమీషన్ వస్తుంది. ఇక గ్యాస్ ఏజెన్సీలు కూడా అమ్మిన ప్రతి సిలిండర్‌పై స్థిరమైన కమీషన్ ఉంటుంది. డెలివరీ కార్మికులకు ఒక్కొ సిలిండర్ డెలివరీపై సుమారు రూ.20 నుండి రూ.30 వరకు కమీషన్ ఉంటుంది. ఎక్కువ సిలిండర్లు డెలివరీ చేస్తే కమిషన్ కూడా పెరుగుతుంది. డెలివరీ చేసేవారికి గ్యాస్ ఏజెన్సీ నుండి నెలకు రూ.5 వేల నుండి రూ. 10 వేల వరకు జీతం ఉంటుంది. ఇక ప్రతీ సిలిండర్ డెలివరీపై వచ్చే సంపాదన చూస్తే.. నెలవారీ ఆదాయం సాధారణంగా రూ.15 వేల నుండి రూ.25 వేల మధ్య ఉంటుంది. రోజుకు సగటున సుమారు 25 నుండి 40 సిలిండర్లను డెలివరీ చేస్తారు. దీంతో రోజువారీ సంపాదన రూ.700 నుండి రూ.వెయ్యి వరకు ఉంటుంది.
గ్యాస్ ఏజెన్సీలు లేదా పంపిణీదారులు విక్రయించే ప్రతి ప్రామాణిక 14.2-కేజీల గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్‌పై సుమారు రూ.73.8 కమీషన్ వస్తుంది. ఈ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏజెన్సీకి నిర్ణయిస్తాయి. ఈ కమిషన్ వినియోగదారులు చెల్లించే ధరలో చేర్చబడుతుంది. 5 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై గ్యాస్ ఏజెన్సీలు సుమారుగా రూ.36.54 సంపాదిస్తాయి. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై వారికి లభించే కమీషన్‌లో దాదాపు సగంగా చెప్పవచ్చు. ఇలా గ్యాస్ డెలివరీ బాయ్, గ్యాస్ ఏజెన్సీలకు ప్రతీ సిలిండర్ డెలివరీపై కమిషన్ ఉంటుంది. వినియోగదారుడికి సిలిండర్ ధరలు వీటిని బట్టి నిర్ణయిస్తారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగితే ఏజెన్సీలకు వచ్చే కమిషన్ కూడా పెరుగుతుంది. అయితే ఈ నిబంధనల గురించి చాలామందికి తెలియదు.