హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విడుదల చేసిన కొత్త యూనికార్న్ ను ఆధునిక రైడర్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లేటెస్టు ఫీచర్లు, ఓబీడీ2బీ ప్రమాణాలతో రూపొందించారు. ఈ బైక్ రూ.1,19,481 (ఎక్స్ షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో ఇసుత్సుము మాట్లాడుతూ భారత్ లోని ప్రీమియం కమ్యూటర్ సెగ్మెంట్ లో హోండా యూనికార్న్ అగ్రగామిగా ఉందన్నారు. లక్షల మంది వాహన దారుల అభిమానం పొందిందన్నారు. కొత్త యూనికార్న్ తో నాణ్యత, సౌకర్యం, విశ్వసనీయత మరింత పెరుగుతుందన్నారు.
క్రోమ్ యాక్సెంట్ లతో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంపులతో, అప్ డేట్ చేసిన కొత్త డిజైన్ తో యూనికార్న్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన లుక్ పరంగా గత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, రెడియంట్ మెటాలిక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. పెర్ల్ సైరన్ బ్ల్యూ కలర్ నిలిపివేశారు. యూనికార్న్ లోని పూర్తి డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో గేర్ పొజిషన్, ఎకో ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్ సమాచారం చూసుకోవచ్చు. యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్టు కూడా ఏర్పాటు చేశారు. ఓబీడీ2బీ నిబంధనలను అనుగుణంగా యూనికార్న్ ను అప్ డేట్ చేశారు. 162.71 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 13 బీహెచ్ పీ, 14.58 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. ఇంజిన్ కు ఐదు స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు.
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హోండాకు మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీ విడుదల చేసిన వాహనాల నాణ్యత, మన్నిక, సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తన వాహనాలను అప్ డేట్ చేస్తూ వెళుతోంది. ఇటీవల యాక్టివా 125, ఎస్ 125, ఎస్ పీ 160 లను ఆధునికరించింది. తాజాగా యూనికార్నా్ కూడా అప్ డేట్ చేసి విడుదల చేసింది. పాత మోడల్ తో పోల్చితే కొత్త మోడల్ ధర రూ.8 వేలు ఎక్కువగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి