
సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం అనేది ఎంతోమంది జీవితకాలం కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది గృహ రుణాలు తీసుకుంటారు. అయితే, ఈ రుణ భారం కొన్నిసార్లు దశాబ్దాల పాటు వెంటాడవచ్చు. మరి గృహ రుణాలను సమర్థవంతంగా, తొందరగా ఎలా పూర్తి చేయాలో.. వడ్డీ మొత్తాన్ని గణనీయంగా ఎలా ఆదా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి. 25 సంవత్సరాల గృహ రుణాన్ని కేవలం 10 సంవత్సరాలలోపు ఎలా ముగించవచ్చో బిజినెస్ నిపుణులు చెప్పారు. సాధారణంగా, 75 లక్షల రూపాయల గృహ రుణం 8 శాతం వడ్డీ రేటుతో 25 సంవత్సరాలకు తీసుకున్నప్పుడు, నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 58 వేలు అవుతుంది. ఈ టెన్యూర్‌లో వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 98 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఇది అసలు లోన్ మొత్తం కంటే ఎక్కువ. మరి వడ్డీని ఎలా తగ్గించుకుంటూ వెళ్లాలంటే.. లోన్ స్టార్ట్ అయిన మొదటి నెలల్లో EMIలో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. ప్రిన్సిపల్ మొత్తానికి చాలా తక్కువ మొత్తం జమ అవుతుంది. ఉదాహరణకు, మొదటి నెలలో 58,000 రూపాయల EMIలో 50,000 రూపాయలు వడ్డీకి, కేవలం 7,886 రూపాయలు మాత్రమే ప్రిన్సిపల్‌కు వెళుతుంది.
ఇది చదవండి: 1.5 టన్నుల ఏసీ గంటకు ఎంత కరెంట్ బిల్లు వస్తుందో తెలుసా.?
ప్రతి 12 నెలల తర్వాత 13వ నెలలో ఒక అదనపు EMI(అంటే ఒక నెలలో రెండు EMIs) చెల్లించడం ద్వారా గణనీయమైన ప్రయోజనం ఉంటుంది. ఈ వ్యూహంతో, 98 లక్షల రూపాయల వడ్డీ సుమారు 76-77 లక్షల రూపాయలకు తగ్గుతుంది. అంటే దాదాపు 12 లక్షల రూపాయలు ఆదా అవుతాయి. రుణ కాలపరిమితి 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల 3 నెలలకు (243 నెలలు) తగ్గుతుంది. ఇది ఐదు సంవత్సరాల ఆదాకు సమానం. ఏటా జీతాలు పెరిగినందున, ద్రవ్యోల్బణం కారణంగా స్థిరమైన EMI భారం తగ్గుతుంది. కాబట్టి, ఒక అదనపు EMI చెల్లించడం అనేది దీర్ఘకాలంలో పెద్ద భారం అనిపించదు.
ఇంకా ఎక్కువ ఆదా చేయాలనుకుంటే, ప్రతి సంవత్సరం రెండు అదనపు EMIs చెల్లించడం మంచిది. దీని వల్ల 98 లక్షల వడ్డీ 64 లక్షల రూపాయలకు తగ్గుతుంది. అంటే 34 లక్షల రూపాయల భారీ మొత్తం ఆదా అవుతుంది. లోన్ కాలపరిమితి 15 నుండి 16 సంవత్సరాలకు(207 నెలలు) తగ్గుతుంది. ఇది దాదాపు 9-10 సంవత్సరాల ఆదాకు సమానం. ఈ విధంగా, ఇంటి లోన్ త్వరగా తీరడమే కాకుండా, మిగిలిన డబ్బును ఇతర పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.
EMI మొత్తాన్ని ప్రతి సంవత్సరం 5 శాతం లేదా 10 శాతం పెంచుకుంటూ వెళ్లడం మరో మంచి పద్ధతి. ఉదాహరణకు, మొదటి 12 నెలలు 58,000 రూపాయలు చెల్లించి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం EMIని 10 శాతం పెంచుకుంటే, లోన్ కేవలం 116 నెలల్లో, అంటే సుమారు 9.5 సంవత్సరాలలో పూర్తవుతుంది. ఇది 25 సంవత్సరాల లోన్‌ను 10 సంవత్సరాలలోపు తీర్చాలనే కలను నిజం చేస్తుంది.
ఇది చదవండి: ఏసీలు కూడా పనికిరావు.. ఇలా చేస్తే 8 నిమిషాల్లో ఇల్లంతా కూల్.. కూల్‌గా.!