
నేటికాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లేదా ఇతర స్థిరమైన ఉద్యోగం రాగానే చాలామంది చేసే మొదటి పని హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేయడం. అయితే, ఇది ఎల్లప్పుడూ సరైన నిర్ణయం కాకపోవచ్చని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇల్లు కొనడం అనేది కేవలం ఒక డ్రీమ్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఆర్థిక బాధ్యత. అందుకే అఫోర్డబిలిటీ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. కెరీర్ ప్రారంభంలోనే భారీ ఈఎంఐ భారం నెత్తి మీద వేసుకుంటే, అది మీ స్వేచ్ఛను హరిస్తుంది.
ఉదాహరణకు, మీకు బెటర్ శాలరీతో వేరే సిటీలో ఆఫర్ వచ్చినా లేదా ఉద్యోగం వదిలేసి ఏదైనా కొత్తగా చేయాలన్నా ఈ ఈఎంఐలు మీకు అడ్డుగోడలా మారుతాయి. మీ శాలరీలో 30 శాతం నుండి గరిష్టంగా 40 శాతం మించి ఈఎంఐ ఉండకూడదని సూచించారు. ఒకవేళ మీ శాలరీ రూ. 1 లక్ష అయితే, మీ ఈఎంఐ రూ. 40 వేలు దాటకూడదు. ఈ ప్రాథమిక సూత్రం పాటిస్తే మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అది మీ ఆర్థిక భద్రతను ప్రమాదంలో పడేస్తుంది.
అయితే, బాగా అభివృద్ధి చెందుతున్న ఏరియాలలో ఇల్లు కొనడం వల్ల లాభం కూడా ఉంటుంది. ఏ ఏరియాల్లో భూమి రేట్లు వేగంగా పెరుగుతాయో గమనించి ఇన్వెస్ట్ చేస్తే, అద్భుతమైన ప్రాపర్టీ అప్రిసియేషన్ పొందవచ్చని చెబుతున్నారు. మీకు 20 శాతం నుండి 40 శాతం వరకు డౌన్ పేమెంట్ చేసే అవకాశం ఉండి, మీరు ఉంటున్న సిటీలోనే పర్మనెంట్‌గా ఉండాలనుకుంటే ఇల్లు కొనడం మంచిదే. కానీ కేవలం సమాజం కోసం లేదా సెంటిమెంట్ కోసం అప్పుల ఊబిలోకి వెళ్లడం సరికాదు. కెరీర్ మధ్యలో, అంటే 30-35 ఏళ్ల వయస్సులో ఇల్లు కొనడం మరింత తెలివైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికి మీ ఆర్థిక స్థితి, కెరీర్‌పై మీకు పూర్తి అవగాహన వస్తుంది.