మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరు తెలియని వారు మనదేశంలో ఎవ్వరూ ఉండరు. ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాల ప్రజలకూ మన ధోనీ పేరు పరిచయమే. సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, ప్రతిభ ఆధారంగా మహోన్నత శిఖరాలు అధిరోహించాడు. అంతర్జాతీయ పోటీలలో కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించి దేశానికి ఎన్నో ట్రోఫీలు సాధించిపెట్టాడు. చిన్నపిల్లల నుంచి యువత వరకూ అందరికీ ఒక రోల్ మోడల్.
భారత క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా ధోనీ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగా కెప్టెన్ అయ్యాడు. నిలకడైన ఆటతీరు, అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు. ప్రపంచ క్రికెట్ లో మన దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాడు. ఇతడిని స్ఫూర్తిగా తీసుకునే అనేక మంది క్రికెట్ లో సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా ధోనీకి అభిమానుల ఆదరణ ఏమాత్తం తగ్గలేదు కదా.. ఇంకా పెరుగుతూనే ఉంది.
ధోనీ మంచి క్రికెటర్ మాత్రమే కాదు. వ్యాపారాలు నిర్వహించడంలో దిట్ట. అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని సంస్థలకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్లలో అత్యంత సంపన్నుడిగా పేరుపొందాడు. ఈయన ఆస్తుల విలువ సుమారు రూ.1,040 కోట్ల కంటే ఎక్కువ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మహేంద్ర సింగ్ ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ ప్రాంచైజీ నుంచి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నాడు. దీనితో పాటు అతడికి కొన్ని వ్యాపారాలు, వివిధ సంస్థలలో పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా ఉన్నాయి.
తాలా అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ధోనీ ఈ సీజన్ లో సీఎస్కే జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయినా అతడి ప్రభావం ఏమీ తగ్గలేదు. ఇతడు సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్‌ల కోసం రూ.కోటి నుంచి రూ. 2 కోట్ల వరకూ వసూలు చేస్తున్నాడు. తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్ డీల్స్ కోసం రూ. 4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. సెవెన్ అనే ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్, ఒక స్పోర్ట్స్ కంపెనీతో పాటు రియల్ ఎస్టేట్‌లో వెంచర్లు కూడా ధోనీకి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..