
స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) గురించి తెలిసే ఉంటుంది. దీని ద్వారా ఒక కంపెనీ తన వాటాలను ప్రజలకు విక్రయిస్తుంది. ఇలా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించుకుంటుంది. వీటిని ఎస్ఎంఈ, మెయిన్ బోర్డు అనే రెండు రకాల ఐపీవోలుగా విభజించారు. వాటి మధ్య తేడాలు, ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న, మధ్య తరహా సంస్థలు విడుదల చేసే పబ్లిక్ ఇష్యూలను ఎస్ఎంఈ ఐపీవోలు అంటారు. తక్కువ మూలధనం, పరిమిత వ్యాపార చరిత్ర కలిగి ఉంటాయి. వీటిని ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ అనే ప్రత్యేక ప్లాట్ ఫాంలో జాబితా చేస్తారు. మెయిన్ బోర్డు ఐపీవోలను పెద్ద కంపెనీలు, బాగా స్థిర పడిన సంస్థలు విడుదల చేస్తాయి. వీటిని నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లలో జాబితా చేస్తారు.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక రిస్కు, ధీర్థకాలిక ప్రణాళిక ఉన్నవారు ఎస్ఎంఈల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. వీటి వల్ల కొంచెం రిస్కు ఉన్నప్పటికీ వ్యాపారం విజయవంతంగా సాగితే అధిక రాబడి అందిస్తాయి. అయితే కంపెనీకి సంబంధించిన కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. కంపెనీ ప్రాథమిక అంశాలు, ప్రమోటర్ ట్రాక్ రికార్డు, వ్యాపార స్కేలబిలిటీని గమనించాలి. అలాగే ఇంటర్నెట్ లో కనిపించే జీఎంపీ సంఖ్యలను గుడ్డిగా నమ్మవద్దు. కానీ ఎస్ఎంఈ ఐపీవో పొందాలంటే అధిక మూలధనం అవసరమవుతుంది. సుమారు రూ.ఒక లక్ష నుంచి రెండు లక్షలు చేతిలో ఉంచుకోవాలి.
మెయిన్ బోర్డు ఐపీవోలు పెట్టుబడి దారులకు చాాలా అనుకూలంగా ఉంటాయి. వీటిని పెద్ద కంపెనీలు విడుదల చేస్తాయి కాబట్టి నమ్మకంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడిదారులు, సంప్రదాయ పెట్టుబడిదారులకు బాగుంటాయి. సుమారు రూ.15 వేలతో వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీలు కాబట్టి నష్టాలు వచ్చే అవకాశం దాదాపు ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..