లాంగ్ హాట్ సమ్మర్ వెళ్లిపోయింది. వరుణుడు రోజూ వర్షిస్తున్నాడు. కొన్ని చోట్ల కుంభవృష్టి కురిపిస్తున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో రోడ్లపై వర్షం నీరు నిలబడిపోతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు కేవలం రాకపోకలు మాత్రమే కాదు. ఎక్కువగా నీళ్లలో కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణాలు చేస్తే వాటి బాడీతో పాటు ఇంజిన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మన దేశంలో కార్లు ఎక్కువగా మెటల్ తో పాటు ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ వర్షాకాలంలో వీటిపై మరింత కేర్ అవసరం. మనం ఏ విధంగా వర్షంలో తడవకుండా గొడుగు, రెయిన్ కోట్ వంటివి వాడతామో అదే విధంగా కార్లను కూడా సంరక్షించాలి. అందుకే ఈ వర్షాకాలంలో కార్లు పాడవకుండా చూసుకొనేందుకు కొన్ని కార్ కేర్ టిప్స్ మీకు తెలియజేస్తున్నాం.
కారు ఎక్స్ టీరియర్.. ఈ వర్షాకాలంలో రోడ్లపై వర్షంనీటితో పాటు బురద, మట్టి కారు ఎక్స్ టీరియర్ పై పేరుకుపోతుంది. దీని వల్ల కారు అశుభ్రంగా కూడా కనిపిస్తుంది. అందువల్ల తరచూ కారును శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవసరం అయితే సర్వీసింగ్ కు ఇవ్వాలి. మంచి వాటర్ లో కారును బాగా తడిపి మైక్రో ఫైబర్ వస్త్రంతో తుడవాలి. కార్ వ్యాక్స్ ను వినియోగిస్తే మంచిది. ఇది మీ కారును మెరిసేలా చేస్తుంది.
వైపర్ బ్లేడ్స్.. ఈ వర్షాకాలంలో కారు అద్దాలకు ఉండే వైపర్ బ్లేడ్లు మంచి కండిషన్లో ఉండాలి. ఎందుకంటే మీరు వర్షంలో ప్రయాణిచాలంటే ఈ వైపర్ తప్పనిసరిగా వాడుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వర్షం నీటితో పాటు ఇతర వాహనాల కారణంగా లేచే బురద కూడా కారు అద్దాలపై కి చేరుకొని దారి కనపడకుండా చేస్తుంది. ఆ వైపర్ బ్లేడ్లు అరిగిపోకుండా చూసుకోవాలి. అరిగిపోతే వాటిని మార్చుకోవాలి.
లైట్లను శుభ్రం చేసుకోండి.. వర్షంలో మీరు క్షేమంగా ప్రయాణం చేయాలంటే లైట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అది రాత్రయినా, పగలైనా లైట్లు ఉపయోగపడతాయి. మీ హెడ్ లైట్లు, టైల్ లైట్లు, ఇండికేటర్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. వాటి పైబాడీని శుభ్రం చేసుకోవాలి. అవి ఫోకస్ సరిగ్గా లేకపోతే ప్రోఫెషనల్ మెకానిక్ కు చూపించి సరిచేయించుకోవాలి.
బ్రేకింగ్ సిస్టమ్.. కారులోచాలా ముఖ్యమైన అంశం దాని బ్రేకింగ్ వ్యవస్థ. అత్యవసర పరిస్థితుల్లో ఇదే మనలను కాపాడుతుంది. ఇవి సరిగ్గా పనిచస్తున్నాయో లేదో తరచూ తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో తడి రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు బ్రేకులు సక్రమంగా ఉండాలి. లేకుంటే ఇబ్బంది పడాలి. అలాగే బ్రేక్ ఆయిల్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
టైర్లను పరీక్షించుకోవాలి.. చాలా మంది టైర్లను చాలా చిన్నచూపు చూస్తారు. కానీ కారు మొత్తం పనితీరుని ఇది ప్రభావితం చేస్తుంది. రోడ్డుపై కారు ప్రయాణానికి మంచి గ్రిప్ ఉండాలన్నా. బ్రేక్ వేసినప్పుడు కారు స్కిడ్ కాకుండా ఉండాలన్నా టైర్లే ప్రధానం. టైర్ డెప్త్, టైర్ ఇన్ ఫ్లేషన్ ను తరచూ తనిఖీ చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..