
మన దేశంలో ఆన్ లైన్ గేమింగ్ బాగా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా యువత దీనికి బాగా అడిక్ట్ అవుతోంది. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమింగ్ మార్కెట్ గడచిన సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఇదే విషయాన్ని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ స్పష్టం చేస్తోంది. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2022లో 1.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ విలువ.. 2025 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. వాస్తవానికి 2023 అక్టోబర్ నుంచి ఈ పరిశ్రమపై జీఎస్టీ రేటును 28%కి పెంచడంతో ఆ ప్రభావం గట్టిగానే పడింది. ఫలితంగా ఈ రంగంలో స్టార్టప్స్ స్థిరంగా నిలబడలేకపోతున్నాయి. వాస్తవానికి ఈ ఆన్ లైన్ గేమింగ్ లో కేవలం నైపుణ్యం ఆధారంగా ఆడే గేమ్స్ ఉంటాయి. అలాగే కేవలం అదృష్టంపై నడిచే జూద క్రీడలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో డ్రీమ్ 11 యాప్ కు సంబంధించిన కేసులో హై కోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. గేమింగ్ యాప్ ఏదైనా వాటిలో డిపాజిట్లపై 28శాతం జీఎస్టీ మాత్రం అన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో సాంకేతికత, నైపుణ్యం ఆధారంగా నడిచే ఈ-స్పోర్ట్స్ కంపెనీలు కేంద్రానికి ఓ వినతి చేశాయి. జూద క్రీడల గాటిన తమను కట్టొద్దని, నైపుణ్య ఆధారంగా ఆడే ఆటలను వేరు చేయాలని కోరాయి. హేతుబద్దీకరణ చేసి, తమకు విధించిన జీఎస్టీ పరిమితిని తగ్గించాలని విన్నవించాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ఈ ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీని తగ్గిస్తారా? ఈ-స్టోర్ట్స్ కంపెనీలు కోరుతున్నట్లు హేతుబద్దీకరణ చేస్తారా? నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుందాం రండి..
నిజమైన నైపుణ్యం-ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లను రక్షించడం అవసరమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జూదం / బెట్టింగ్‌ను వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న దశలో నైపుణ్యం ఆధారంగా సాగే ఆన్ లైన్ ప్లాట్ ఫారంలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. అయితే ఈ 28శాతం పన్ను విధానంపై ఇప్పటికే ఓ కేసు అపెక్స్ కోర్టులో ప్రధాన ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు సవాలు చేశాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా చట్టపరమైన చర్యలకు కొంత నియంత్రణ స్పష్టత, మరింత ఏకీకృత విధానాన్ని కలిగి ఉండటం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక పందెలకు, యాప్ కొనుగోళ్లకు కూడా ఒకేరకమైన పన్ను విధించడాన్ని కూడా ఆ పరిశ్రమ వ్యతిరేకిస్తోంది. పందెం మొత్తాలకు భిన్నంగా యాప్/గేమ్ కొనుగోళ్ల జీఎస్టీ రేట్లు వసూలు చేయాలని, ఇది బాధ్యతాయుతమైన మానిటైజేషన్ ను ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ తరహా సూచన ఏది లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా వీటిపై ఎటువంటి కొత్త నిర్ణయం తీసుకోబోదని వారు అంచనా వేస్తున్నారు. ఫలితంగా పాత పన్ను విధానమే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ అద్భుతమైన విస్తరణను చూసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమకు ప్రోత్సహించాలి గానీ.. మరింత కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని ఆన్ లైన్ గేమింగ్ సంస్థలు కోరుతున్నాయి. అందుకే ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి, జూదాన్ని తరిపి కొడుతూనే నైపుణ్యం ఆధారంగా నడిచే ఆన్ లైన్ ప్లాట్ ఫారంను ప్రోత్సహించాలని, అప్పుడే స్థిరమైన వృద్ధి సాధించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..