
వివిధ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఖాతాలుంటాయి. వీరి జీతంలోని ప్రతి నెలా కొంత మొత్తం తీసి, దానిలో జమచేస్తారు. యజమాన్యాలు కూడా తమ వాటాను కార్మికుల పేరు మీద కడతాయి. ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఆ డబ్బంతా ఏక మొత్తంలో అందజేస్తారు. దాని ద్వారా ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఆసరా కలుగుతుంది. పీఎఫ్ చందాదారులందరూ ప్రతినెలా తమ జీతం నుంచి చందా చెల్లిస్తారు. ఇది ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. కానీ చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. దానిని తెలుసుకోవాలని అనుకున్నా ఏం చేయాలో తెలియదు. కానీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం చాలా సులభం. ఎస్ఎమ్ఎస్, మిస్ట్ కాల్, యూఎన్ ఏ నంబర్ ను ఉపయోగించి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
కేవలం మీ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ చేసి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం. ఇది చాలా సులభం. మీ యూఏఎన్ నంబర్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీకు బ్యాలెన్స్ తెలియజేస్తూ మెసేజ్ వస్తుంది.
ఈపీఎఫ్ చందాాదారులైన ప్రతి ఉద్యోగికీ 12 అంకెల నంబర్ ను కేటాయిస్తారు. దానిని యూనివర్సల్ అక్కౌంట్ నంబర్ (యూఏఎన్) అంటారు. దీనికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంటుంది. ఉద్యోగి ఎన్ని సంస్థలకు మారినా ఈ నంబర్ పర్మినెంట్ గా ఉంటుంది.
పీఎఫ్ చందాదారులకు యూఏఎన్ అనేది చాలా కీలకం. పీఎఫ్ కు సంబంధించిన ప్రతి పనికీ ఆ నంబర్ అవసరమవుతుంది. మీరు బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవాలన్నా ఆ నంబర్ ఉంటేనే సాధ్యమవుతుంది. అయితే కొందరికి ఆ నంబర్ తెలియకపోవచ్చు, మరికొందరు మరిచిపోయి ఉంటారు. అయినా ఎటువంటి ఆందోళన వద్దు. చాలా సులభంగా మన యూఏఎన్ ను తెలుసుకునే వీలుంది.