
ఆదాయ పన్ను దాఖలుకు జూలై 31తోనే సమయం ముగిసింది. దాదాపు పన్ను చెల్లించే అందరూ ఉద్యోగులు ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) సమర్పించారు. ఇక ఐటీఆర్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మందికి ఇప్పటికే ట్యాక్స్ రిఫండ్ నగదు తమ ఖతాల్లో జమైంది. అయితే ఇప్పటికీ కొంత మందికి ఈ ట్యాక్స్ రిఫండ్ నగదు రాలేదు. పలు కారణాల వల్ల లేట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో పన్ను చెల్లింపు దారులు ఏం చేయాలి? రిఫండ్ ఆలస్యం అవడానికి గల కారణాలను ఎలా తెలుసుకోవాలి? ఏదైనా సమస్య ఉంటే ఎలా పరిష్కరించుకోవాలి? తెలుసుకుందాం రండి..
ఐటీఆర్ లు ప్రాసెస్ అయ్యాయని, రీఫండ్ మొత్తాలు కూడా లెక్కింపు పూర్తయ్యిందని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్‌లో హైలైట్ చేసింది. అయినప్పటికీ, ఈ రీఫండ్‌లను జారీ చేయడంలో ఐటీ విభాగం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎందుకంటే కొంతమంది పన్ను చెల్లింపుదారులు రిఫండ్ చెల్లింపు కోసం బ్యాంక్ ఖాతాలను ఇంకా వెరిఫై చేయలేదు. మీ పన్ను రిఫండ్ ఇంకా రాకపోవడానికి ఇదే ప్రధాన కారణ కావచ్చు. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఈ విషయమై హెచ్చరించింది. ఐటీఆర్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కరూ తమ అకౌంట్లను వెరిఫై చేసుకోవాలని సూచించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ లో దీనిని పూర్తి చేయాలని చెప్పింది. ఆదాయపు పన్ను రీఫండ్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వెరిఫై బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ అవుతుంది. అలా వెరిఫై చేయకపోవడం వల్ల రిఫండ్ మొత్తం జమ కావడంలో ఆలస్యం అవుతోంది.
ఇలా వెరిఫై చేసుకోండి.. http://incometax.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. దానిలో ప్రోఫైల్ ను తనిఖీ చేయండి. మై బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి తనిఖీ చేయండి. రీ వ్యాలిడేట్/యాడ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఎంచుకోండి. అయితే ఇంతకు ముందు వ్యాలిడేట్ చేసిన బ్యాంకు అకౌంట్లు రీ వ్యాలిడేట్ కావడానికి కాస్త సమయం పడుతుందని గమనించాలి. ఎందుకంటే బ్యాంక్ ఖాతాలు మారుతాయి కాబట్టి సమయం తీసుకుంటుంది.
ఇది కాకుండా, మీరు మీ ఐటీఆర్ రిఫండ్ పొందకపోవడానికి మరికొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అవేంటంటే..
ఐటీఆర్ ఫైలింగ్ ఇంకా ప్రాసెస్ లో ఉండటం.. ఆదాయపు పన్ను శాఖ సాధారణంగా ఐటీఆర్‌ని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. మీ ఐటీఆర్ ప్రాసెస్‌లో ఉంటే, రిఫండ్ మీ ఖాతాలో జమ కావడానికి సమయం పడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే రిఫండ్ జారీ అవుతుంది.
ఐటీఆర్ రీఫండ్ అర్హత ఉందా.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ మీ అర్హతను ధృవీకరించినట్లయితే మీరు ఆదాయపు పన్ను రిటర్న్ రీఫండ్‌ను అందుకుంటారు. మీ అర్హతను నిర్ధారించిన తర్వాత, రిఫండ్ సాధారణంగా నాలుగు వారాల్లో క్రెడిట్ అవుతుంది.
బ్యాంక్ ఖాతా వివరాలు తప్పుగా ఇస్తే.. ఐటీఆర్ ప్రాసెస్ చేసిన మీ బ్యాంక్ ఖాతా ముందుగా వెరిఫై చేసిన ఉండటం చాలా అవసరం, లేకుంటే, రిఫండ్ జారీకాదు. అంతేకాకుండా, మీ బ్యాంక్ ఖాతాలో నమోదు చేసిన పేరు మీ పాన్ కార్డ్‌లోని వివరాలతో సరిపోలితేనే ఆ రీఫండ్ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది. కానీ ఖాతా వివరాలు తప్పుగా ఉంటే రిఫండ్ రాదు.
ఐటీఆర్ తప్పనిసరిగా ఈ-వెరిఫై చేయాలి.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఈ-వెరిఫై చేయడం తప్పనిసరి. ఐటీఆర్ దాఖలు చేసిన 30 రోజులలోపు అందరూ తప్పనిసరిగా ఈ-ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇది మీ రీఫండ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..