లగ్జరీ కార్లలాగే.. లగ్జరీ బైక్ లు కూడా ఉన్నాయి. కుర్రాళ్లు కొన్ని రకాల హై ఎండ్ బైక్ లను చాలా ఇష్టపడతారు. వాటిల్లో హార్లీ డేవిడ్సన్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ కు అమితమైన డిమాండ్ ఉంది. అలాగే రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ బైక్ పై ఇష్టం ఉన్నా కొనుగోలు చేయడానికి జంకుతారు. సరిగ్గా అలాంటి వారి కోసమే హార్లీ డేవిడ్సన్ ఓ కొత్త బైక్ ను తీసుకొచ్చింది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 (Harley-Davidson X350) పేరిట మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. చైనాలో ఈ 350 సీసీ మోటార్‌సైకిల్ ధర 33,000 యువాన్లు అంటే మన కరెన్సీ లో సుమారు రూ.3.93 లక్షలు ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ బైక్ లలో ఇదే అతి తక్కువ ధర కావడం విశేషం. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ బైక్ అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హ్యార్లీ డేవిడ్సన్ ఈ కొత్త బైక్ ను చైనా కంపెనీ క్యూజే మోటార్స్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించింది. ఇప్పటికే భారత మార్కెట్లో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న బెనెల్లీ కూడా క్యూజే మోటార్స్ కు చెందినదే కావడం గమనార్హం..
హార్లీ డేవిడ్సన్ గతంలో ఉత్పత్తి నిలిపి వేసిన స్పోర్ట్‌స్టర్ ఎక్స్ఆర్1200ఎక్స్ ఆధారంగా ఈ కొత్త బైక్ హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 బైక్‌ను తయారు చేశారు. ఇది సర్క్యులర్ హెడ్ ల్యాంప్ తో క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది. ఇదే డిజైన్‌లో సర్క్యులర్ మోనోపాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. 350సీసీ టూ-వీలర్‌లో టియర్ డ్రాప్డ్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఇదే డిజైన్ ప్యాట్రన్ వెనుక భాగం వరకు కొనసాగుతుంది.
బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్లు అమర్చినట్లు తెలుస్తోంది. ముందువైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్‌ను అందిస్తుంది. హార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అల్లాయ్ వీల్స్ ముందు 120/70 టైర్, వెనుక 160/60 టైర్‌తో వస్తాయి.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 బ్రేక్‌లో నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో ముందువైపు ఒకే డిస్క్ వస్తుంది. అదే విధంగా వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే డిస్క్ ఉంటుంది. డిస్క్ బ్రేక్‌ల పరిమాణం ఇంకా తెలియదు. ఈ బైక్ 180 కిలోల బరువు ఉంటుంది. 353 సీసీ ప్యార్లల్-ట్విన్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో పొందుపర్చింది. ఈ ఇంజన్ 36.2 బిహెచ్‌పి, 31 ఎన్ఎమ్ మోటార్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. చైనాలో ఎక్స్ 350 బైక్ జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ వంటి కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.
హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హార్లీ డేవిడ్సన్ ఇండియన్ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో మోటార్‌సైకిల్ విడుదలపై ఎటువంటి సమాచారం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..