సాధారణంగా అందరూ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పెట్టుబడి అంటే అధిక రాబడి అని ఫీలవుతూ ఉంటారు. గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా అన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు బాగా పెంచాయి. అయితే గత మూడు త్రైమాసికాల నుంచి మాత్రం రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెరుగుదలకు బ్రేక్ పడింది. ముఖ్యంగా పెద్ద బ్యాంకులేవి వడ్డీ పెంపుదలను ప్రకటించడం లేదు. అయితే కొన్ని స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం కస్టమర్లను పెంచుకునేందుకు వడ్డీ పెంపును ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నిల్వలపై ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సమానంగా వడ్డీ పెంపును ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పొదుపు ఖాతా డిపాజిట్లపై గరిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఆగస్టు 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా సేవింగ్ ఖాతాపై వడ్డీ రేట్లను బ్యాంక్ సవరించింది. పొదుపు ఖాతాలపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నట్లు ఫిన్‌కేర్ బ్యాంక్ తెలిపింది. రూ.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ నిల్వలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే కస్టమర్లు తమ పొదుపులను మునుపెన్నడూ లేని విధంగా పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తుందని బ్యాంక్ తన ప్రకటనలో తెలిపింది. ‘ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో మా దృష్టి ఎల్లప్పుడూ మా కస్టమర్‌లు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి శక్తివంతం చేయడంపైనే ఉంటుంది. మా సేవింగ్స్ ఖాతాపై పరిశ్రమ-ప్రధాన వడ్డీ రేటు 7.25 శాతంతో మేము పొదుపులను ప్రోత్సహించడం, మా విలువైన కస్టమర్‌లకు సురక్షితమైన, రివార్డింగ్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యం’ అని ఫిన్‌కేర్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
అలాగే కరెంట్, సేవింగ్స్ ఖాతా, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు, బంగారంపై రుణం, ఆస్తిపై రుణం వంటి క్రెడిట్ ఆఫర్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులతో వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి అనేక రకాల బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా కస్టమర్లకు సేవలందించడం తమ లక్ష్యమని బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 19 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో 338 జిల్లాలు, 57,186 గ్రామాలను కవర్ చేస్తూ 1,231 బ్యాంకింగ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. బ్యాంక్ 42 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. దాదాపు ఈ బ్యాంక్ 14,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..