
Gold Bill
బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారం పది గ్రాములు.. రూ.లక్షా 80 వేల వరకు పలుకుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటుంటారు.. అయితే.. అలా కొనడం మంచిదేనా..? భవిష్యత్తులో ఏం జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ముందు తెలుసుకోవాలి.. బిల్లు లేకుండా బంగారం కొనుగోలు చేయడం తాత్కాలికంగా ప్రయోజనకరంగా కనిపించినా.. ఇది దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారితీస్తుంది. కొందరు వ్యాపారులు బిల్లు లేకుండా బంగారం ఇస్తే 3% జీఎస్టీని ఆదా చేసుకోవచ్చని చెబుతారు. కానీ ఈ చిన్న పొదుపు, భవిష్యత్తులో మీరు ఎదుర్కొనే పెద్ద ప్రమాదాలకు, నష్టాలకు నాందిగా.. వ్యాపార నిపుణులు చెబుతున్నారు. బిల్లు లేకుండా బంగారం కొనడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం..
బిల్లు లేకుండా బంగారం కొంటే ఏం జరుగుతుందంటే..
- బంగారపు స్వచ్ఛతకు ఎటువంటి హామీ ఉండదు. మీరు 22 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తున్నారని భావించినా.. వ్యాపారి 18 క్యారెట్ల బంగారాన్ని మీకు అంటగట్టే అవకాశం ఉంది. బిల్లు లేనప్పుడు, మీరు స్వచ్ఛతను నిరూపించలేరు. ఇటీవల నకిలీ హాల్‌మార్క్ మిషన్లు కూడా అందుబాటులోకి రావడంతో, హాల్‌మార్క్ ఉన్నప్పటికీ మోసపోయే ప్రమాదం ఉంది.
- బరువులో మోసం జరిగే అవకాశం ఉంది. 10 గ్రాములు అని చెప్పి 9.5 గ్రాములు ఇవ్వవచ్చు. కొందరు వ్యాపారులు తూకం యంత్రాల్లో సర్దుబాట్లు చేసి తక్కువ బరువు ఇచ్చే అవకాశం ఉంటుంది. బిల్లు లేకపోతే, మీరు సరైన బరువును నిరూపించలేరు.
- చట్టపరమైన రక్షణ కోల్పోతారు. ఒకవేళ మీరు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా, లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, మీ వద్ద కొనుగోలుకు సంబంధించిన ఎటువంటి రుజువు ఉండదు. కోర్టు మిమ్మల్నే ప్రశ్నిస్తుంది. ఇది మీ కేసును బలహీనపరుస్తుంది.
- బంగారాన్ని తిరిగి విక్రయించేటప్పుడు భారీ నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో మీకు డబ్బు అవసరమై బంగారాన్ని విక్రయించాలనుకున్నప్పుడు, మీరు బిల్లును సమర్పించలేకపోతే, చాలా మంది వ్యాపారులు మార్కెట్ ధర కంటే 20% వరకు తక్కువ ధరను కోట్ చేస్తారు. మీరు జీఎస్టీ రూపంలో ఆదా చేసిన 3% కంటే, ఈ 20% నష్టం చాలా రెట్లు ఎక్కువ. ఉదాహరణకు, ఒక లక్ష రూపాయల విలువైన బంగారానికి బిల్లు లేకపోతే, మీరు పది వేలు ఆదా చేయడానికి ప్రయత్నించి, లక్ష రూపాయలలో పాతిక వేలు కోల్పోయే ప్రమాదం ఉంది..
కాబట్టి, జీఎస్టీ అనేది ఖర్చు కాదు, మీ బంగారం కొనుగోలుకు ఒక రకమైన భద్రతా బీమా. ఇది మీ పెట్టుబడిని, మీ హక్కులను పరిరక్షిస్తుంది. రైతు బజార్‌లో కూరగాయలు కొన్నట్లు కాకుండా, బంగారం వంటి విలువైన వస్తువులను కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో తలెత్తే సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..