Gold Rate: ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు చేరింది బంగారం ధర
బంగారం భగభగలు మాములుగా లేవు. తగ్గేదే లే అన్నట్లుగా పసిడి దూసుకుపోతుంది. ఈ ఏడాదిలో ప్రథమార్థంలోనే లక్ష మార్క్ టచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పసిడి ఇదే జోరు కొనసాగిస్తే మధ్యతరగతివారు బంగారం కొనడం కష్టమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా చైనా అమెరికాపై సుంకాలతో ప్రతీకారం తీర్చుకున్న తరువాత, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లో తమ ఇన్వెస్ట్‌మెంట్స్ వెనక్కి తీసుకుని బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.

పగ్గాలే లేనట్టుగా పరుగులు పెడుతోంది..బంగారం ధర. అంతర్జాతీయంగా ట్రంఫ్ ఎఫెక్ట్.. దేశీయంగా రూపీ పతనంతో కొత్త రికార్డులను తాకుతోంది..గోల్డ్ రేట్. గోల్డ్ లక్ష రూపాయలకు చేరే రోజు ఎంతో దూరం లేదనిపించే రేంజ్‌లో ఈ స్పీడ్ కనిపిస్తోంది. వాణిజ్య యుద్ధం కారణంగా స్టాక్‌మార్కట్లలో అనిశ్చితి కనిపిస్తోంది. ఇవన్నీ కలిసి బంగారం ధరల స్పీడును పెంచేస్తోంది. తాజాగా ఆల్‌టైమ్ రికార్డ్ ధరకు చేరింది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర రూ.87 వేలకు చేరింది. అవును.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,000 ట్రేడవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,560గా ఉంది. ఇక వెండి కూడా తగ్గేదే లే అంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.98,000గా ఉంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్‌మార్కెట్‌లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని గోల్డ్ కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి రేట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలామంది స్టాక్‌మార్కెట్‌లు అంత సేఫ్ కాదన్న అంచనాతో ఉన్నారు. దీంతో బంగారంపైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్‌గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డ్ వైపుగా దూసుకెళ్తోంది. అతి త్వరలో లక్ష రూపాయల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.
గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కి మధ్య తరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం తప్పితే.. తగ్గే అవకాశాలే కనిపించడం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..