
మన దేశంలో బంగారానికి ఉండే ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టపడతారు. ఈ మధ్య కాలంలో బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. పెట్టుబడి మార్గంగా కూడా మధ్యతరగతి వర్గం చూస్తోంది. దీంతో బంగారాన్ని కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ధర చూస్తే మాత్రం ఖంగుతినే పరిస్థితి ఉంది. ఒక్క తులం బంగారం కొనాలన్నా.. వామ్మో అంటున్నారు. 10 గ్రాముల బంగారం దాదాపు లక్షకు చేరువైంది.
అయితే.. బంగారం ధర చూసి బెంబేలెత్తి పోతున్న వారికి ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే.. రానున్న కాలంలో బంగారం ధర దిగి వచ్చే అవకాశం ఉంది. బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, రాబోయే రెండు నెలల్లో డాలర్ పరంగా 12–15 శాతం తగ్గవచ్చని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. యూఎస్‌కు చెందిన మార్నింగ్‌స్టార్ కూడా కొన్ని సంవత్సరాలలో బంగారం ధర 38 శాతం తగ్గుతుందని పేర్కొంది. మంగళవారం రిటైల్ బంగారం ధర 10 గ్రాములకు రూ.96,960గా ఉంది. 3 శాతం జీఎస్టీతో కలిపి అది రూ.99,868 అయింది.
ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బంగార ధర భారీగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో ప్రారంభమైన వాణిజ్య వివాదాల మధ్య పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించారు. బంగారాన్ని ఎక్కువ నిల్వ చేసుకోవడం ప్రారంభించడంతో ధర ఇంత భారీగా పెరిగింది. అయితే “మే నెల మొదటి వారం రోజుల్లో, అక్షయ తృతీయ తర్వాత, ధరలు తగ్గడం ప్రారంభమైంది. మే 15న 10 గ్రాములకు రూ. 92,365కి చేరుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి