Gold: 4 ఏళ్లలో 245% పెరిగిన బంగారం.. ఇప్పుడు కొత్తగా కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా?

Gold: గడిచిన నాలుగేళ్లలో బంగారం స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఈ రెండింటినీ పోల్చడం తగదని అరుణ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈక్విటీలు మీ సంపదను రెట్టింపు చేస్తాయి. బంగారం ఆ సంపదను కాపాడుతుంది. దీర్ఘకాలికంగా చూస్తే ఎప్పుడూ ఈక్విటీ మార్కెట్లే..

Gold: 4 ఏళ్లలో 245% పెరిగిన బంగారం.. ఇప్పుడు కొత్తగా కొనాలా, అమ్మాలా లేక హోల్డ్ చేయాలా?
Gold

Updated on: Jul 08, 2026 | 10:16 AM

Gold: గడిచిన నాలుగేళ్లలో పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపించిన అసెట్ ఏదైనా ఉందీ అంటే అది బంగారమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2022 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక అన్స్ బంగారం ధర సుమారు $1,620 ఉండగా, 2026 నాటికి అది ఏకంగా $5,595 గరిష్ట స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు రూపాయి విలువ బలహీనపడటంతో.. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ. 50,000-52,000 నుండి ఈ ఏడాది ప్రారంభంలో ఏకంగా రూ. 1.72 లక్షల ఆల్‌టైమ్ హైకి చేరింది. అయితే ఇటీవల మార్కెట్ కొంత తగ్గినప్పటికీ, ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 1.46 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు బంగారం ఇంకా కొనాలా? ఉన్నదాన్ని ఉంచుకోవాలా? లేక లాభాలు బుక్ చేసుకోవాలా? దీనిపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అరుణాసెట్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ ఫౌండర్, పార్టనర్ అరుణ్ పటేల్ పలు వివరాలు అందించారు. ఆయన తెలిపిన ప్రకారం..

1. లాభాల బుకింగ్ vs పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్

బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పి ఉన్నఫళంగా మొత్తం అమ్మేయడం సరికాదు. ఇక్కడ పెట్టుబడిదారులు తమ ‘పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్’పై దృష్టి పెట్టాలి.

ఉదాహరణకు: మీ మొత్తం పెట్టుబడుల్లో బంగారం వాటా 10% ఉండాలని మీరు అనుకున్నారనుకుందాం. కానీ, ఇప్పుడు బంగారం ధరలు పెరగడం వల్ల దాని విలువ మీ పోర్ట్‌ఫోలియోలో 20% కి చేరితే.. అప్పుడు కొంతమేర లాభాలను బుక్ చేసుకుని, ఆ డబ్బును ఇతర అసెట్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది. బంగారం అనేది మీ సంపదను పెంచే సాధనం కాదు. ఆర్థిక సంక్షోభ సమయాల్లో మీ పెట్టుబడులకు ఒక రక్షణ కవచం లాంటిదని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

2. బంగారం ధరలు ఇకపై ఇంతే వేగంగా పెరుగుతాయా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనత వంటి కారణాలు బంగారానికి ఎప్పుడూ మద్దతుగా నిలుస్తాయి. అయితే, రాబోయే రోజుల్లో ధరలు ఇంతే వేగంగా దూసుకుపోతాయని ఆశించలేం.

గత చరిత్ర చూస్తే: 2011లో గరిష్ట స్థాయికి చేరిన బంగారం, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పెద్దగా రాబడినివ్వలేదు. అలాగే 2020 కోవిడ్ సమయంలో పెరిగిన ధరలు, ఆ తర్వాత 20-22% వరకు తగ్గాయి. ఈ ఏడాది (2026) జనవరిలో రూ. 1.72 లక్షల వద్ద ఉన్న బంగారం, ఇప్పుడు 18% తగ్గి రూ. 1.41 లక్షల స్థాయికి చేరింది. గత మార్కెట్ సైకిల్స్ ఆధారంగా చూస్తే, రాబోయే 12 నుండి 18 నెలల కాలంలో బంగారం ధరలు ఒకే పరిధిలో కొనసాగేందుకు లేదా మరికొంత తగ్గేందుకు 80% అవకాశాలు ఉన్నాయని పటేల్ అంచనా వేస్తున్నారు. అందుకే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని ఆశించకూడదు.

3. మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత బంగారం ఉండాలి?

పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద తప్పు.. మొత్తం డబ్బును బంగారంలో పెట్టడం లేదా అస్సలు పెట్టకపోవడం. ఆదర్శవంతమైన పెట్టుబడి మీ రిస్క్ తీసుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ (స్టాక్ మార్కెట్) వైపు మొగ్గు చూపుతూ  దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారు తమ పోర్ట్‌ఫోలియోలో 5-10% బంగారానికి కేటాయిస్తే సరిపోతుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కోరుకునే వారు 10-15% వరకు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టడం అంత లాభదాయకం కాదు. ఎందుకంటే కంపెనీల షేర్ల లాగా బంగారం ఎలాంటి డివిడెండ్లను లేదా అదనపు ఆదాయాన్ని జనరేట్ చేయలేదు.

4. పెట్టుబడికి ఏది బెస్ట్? ఫిజికల్ గోల్డ్, ఈటీఎఫ్ లేక ఎస్‌జీబీ (SGB)?

బంగారంలో ఎంత పెట్టాలనే దానితో పాటు, ఏ రూపంలో పెట్టాలనేది కూడా చాలా ముఖ్యం:

  • గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs): సాధారణ ఇన్వెస్టర్లకు ఇవి చాలా ఉత్తమమైనవి. ఇందులో పారదర్శకమైన ధరలు ఉంటాయి. అవసరమైనప్పుడు సులభంగా అమ్ముకోవచ్చు (Liquidity), భద్రతా ఖర్చులు ఉండవు. పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ చేయడానికి ఇవి ఎంతో అనుకూలం.
  • ఫిజికల్ గోల్డ్ (నగలు/నాణేలు): అత్యవసర కాలానికి లేదా అలంకరణకు ఇది ఓకే కానీ, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూస్తే దీనిపై జీఎస్‌టీ (GST), తరుగు, మజూరీ (Making Charges) వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. తిరిగి అమ్మేటప్పుడు కూడా పూర్తి విలువ రాకపోవచ్చు.
  • సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs): ఒకప్పుడు ఇవి చాలా ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండేవి. ఎందుకంటే బంగారం ధర పెరగడంతో పాటు ఏటా 2.5% వడ్డీ లభించేది. మెచ్యూరిటీ తర్వాత పన్ను మినహాయింపు ఉండేది. అయితే ఇందులో లాక్-ఇన్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌బీఐ కొత్త బాండ్లను జారీ చేయడం లేదు.

ఈక్విటీలా బంగారం లాభాలు ఇవ్వగలదా?

గడిచిన నాలుగేళ్లలో బంగారం స్టాక్ మార్కెట్ కంటే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఈ రెండింటినీ పోల్చడం తగదని అరుణ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈక్విటీలు మీ సంపదను రెట్టింపు చేస్తాయి . బంగారం ఆ సంపదను కాపాడుతుంది. దీర్ఘకాలికంగా చూస్తే ఎప్పుడూ ఈక్విటీ మార్కెట్లే బంగారాని కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడు కొద్దికొద్దిగా కొనుగోలు చేస్తూ, మీ పోర్ట్‌ఫోలియోలో దానికి ఇవ్వాల్సిన 10-15% శాతాన్ని స్థిరంగా ఉంచుకోవడం ఈ సమయాల్లో అత్యంత సురక్షితమైన వ్యూహం.

ఇది కూడా చదవండి: RBI: వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. 100 రూపాయల నోట్లపై ఆర్‌బిఐ కీలక హెచ్చరిక జారీ..!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us