
పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు బిల్లు చూసి ఆశ్చర్యపోవడం సాధారణం. బంగారం ధరలతో పాటు బిల్లులో రెండు రకాల జీఎస్‌టీ కనిపించడంతో ఒకే వస్తువుపై రెండుసార్లు పన్ను వేస్తున్నారా? అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. కానీ వాస్తవానికి ఈ రెండు పన్నులు వేర్వేరు అంశాలపై విధించబడతాయి. భారతదేశంలో బంగారం కొనుగోలు చేసినప్పుడు, బంగారం అసలు విలువపై 3 శాతం జీఎస్‌టీ విధిస్తారు. ఇది బంగారు నాణేలు, బిస్కెట్లు, లేదా ఆభరణాలు అన్న తేడా లేకుండా వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన బంగారం కొంటే, రూ.3,000 జీఎస్‌టీ చెల్లించాలి.
ఇక ఆభరణాల తయారీకి సంబంధించిన మేకింగ్ ఛార్జీలుపై అదనంగా 5 శాతం జీఎస్‌టీ విధిస్తారు. ప్రభుత్వం దీన్ని ఒక సేవగా పరిగణిస్తుంది. ఉదాహరణకు ఒక హారం తయారీ ఛార్జీ రూ.20,000 అయితే, దానిపై రూ.1,000 జీఎస్‌టీ జోడించబడుతుంది. అందుకే బిల్లులో రెండు వేర్వేరు పన్నులు కనిపిస్తాయి. అంటే వినియోగదారుడు ఒకే వస్తువుపై రెండుసార్లు పన్ను చెల్లిస్తున్నాడని కాదు. మొదటి పన్ను బంగారు లోహంపై, రెండవది ఆభరణం తయారీ సేవపై విధించబడుతుంది. అయితే ఈ రెండు కలిపి బిల్లు మొత్తాన్ని గణనీయంగా పెంచుతాయి.
పాత బంగారాన్ని కొత్త ఆభరణాలుగా మార్చుకోవాలనుకునే వారికి కొంత ప్రయోజనం ఉంటుంది. పాత బంగారాన్ని నేరుగా మార్పిడి చేస్తే సాధారణంగా మేకింగ్ ఛార్జీలు, వాటిపై 5 శాతం జీఎస్‌టీ మాత్రమే వర్తిస్తుంది. కానీ పాత బంగారాన్ని అమ్మి, తర్వాత కొత్తది కొనుగోలు చేస్తే పూర్తి కొనుగోలు విలువపై మళ్లీ 3 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. నిపుణుల సూచనల ప్రకారం బంగారం కొనుగోలు సమయంలో పూర్తి వివరాలతో కూడిన బిల్లును తీసుకోవడం చాలా ముఖ్యం. బంగారం ధర, మేకింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ వివరాలను విడివిడిగా పరిశీలించాలి. అలాగే BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే కొనుగోలు చేయడం ద్వారా స్వచ్ఛతపై నమ్మకం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి