వార్‌ ఎఫెక్ట్‌.. బంగారం, వెండిపై లాభాలు బుక్‌ చేసుకోవడానికి ఇదే సరైన టైమా?

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతున్నారు. దీనితో బులియన్ మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారం రూ. 1.70 లక్షలు, వెండి రూ. 3 లక్షల వరకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వార్‌ ఎఫెక్ట్‌.. బంగారం, వెండిపై లాభాలు బుక్‌ చేసుకోవడానికి ఇదే సరైన టైమా?
Gold And Silver 1

Updated on: Mar 02, 2026 | 6:30 AM

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరం కావడంతో ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ బులియన్ మార్కెట్‌పై పడింది. సోమవారం బంగారం, వెండి ధరలు గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే ధరలు ఎగబాకడం ఈ అంచనాలకు బలం చేకూరుస్తోంది.

శుక్రవారం కామెక్స్‌లో అంతర్జాతీయ స్పాట్ ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా MCX ఫ్యూచర్స్‌లో స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశీయ సెషన్‌లో బంగారం ధర 0.08 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,61,971 వద్ద ముగియగా, వెండి ధర 0.23 శాతం పడిపోయి కిలోగ్రాముకు రూ.2,81,990 వద్ద నిలిచింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో వెండి 7.85 శాతం పెరిగి ఔన్సుకు 93.82 డాలర్లకు, బంగారం 1.97 శాతం పెరిగి ఔన్సుకు 5,296.40 డాలర్లకు చేరింది.

ఆన్‌లైన్ బ్రోకరేజ్ సంస్థ LKP సెక్యూరిటీస్‌కు చెందిన కమోడిటీ విశ్లేషకుడు జతీన్ త్రివేది ప్రకారం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండివైపు మళ్లడం సహజం. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడిలో ఉండటంతో మూలధనం విలువైన లోహాల్లోకి ప్రవహించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడికి ఇరాన్ ప్రతిదాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1.70 లక్షల వరకు, వెండి ధర కిలోకు రూ.3 లక్షల వరకు చేరే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

అయితే పరిస్థితులు ఒక్కసారిగా మారే అవకాశమూ ఉందని హెచ్చరికలు ఉన్నాయి. దౌత్యపరమైన చర్చలు ప్రారంభమైతే లేదా ఉద్రిక్తతలు తగ్గితే ప్రారంభంలో వచ్చిన 3–6 శాతం లాభాల తర్వాత బులియన్ మార్కెట్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ కనిపించవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. మొత్తంగా ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు కొనసాగితే బంగారం, వెండి ధరల్లో అస్థిరతతో కూడిన ఎగబాకే ధోరణి కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us