
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శౌర్య పురస్కార గ్రహితలకు తీపికబురు అందించింది. ఈ పురస్కారం పొందిన సైనికులను గౌరవించడంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి పురస్కార గ్రహీతలకు జీవితాంతం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారి కుటుంబాలకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దేశ రక్షణ కోసం పనిచేసే సైనికులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు నిబంధనలను నోటిఫై చేయగా.. ఎవరెవరికి వర్తిస్తుందనేది కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.
శౌర్య పురస్కార గ్రహీతలందరూ జీవితాంతం దేశంలో ఎక్కడనుంచి ఎక్కడికైనా ఉచితంగా రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు. ఇక పురస్కార గ్రహీత మరణిస్తే జీవిత భాగస్వామికి వర్తిస్తుంది. ఒకవేళ జీవిత భాగస్వామి మరో పెళ్లి చేసుకుంటే ఉచిత ప్రయాణం వర్తించదు. ఇక పెళ్లి కాని సైనికుడికి మరణాంతరం పురస్కారం లభిస్తే.. తల్లిదండ్రులతో పాటు వారితో పాటు తోడుగా వవ్చే ఒక వ్యక్తికి ఉచిత రైలు ప్రయాణం అందుతుంది. ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, ఏసీ చైర్ కార్ కోచ్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. సైనికుల కుటుంబాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు, వారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇది అమల్లోకి రానుంది. దీని వల్ల చాలామంది లబ్ది పొందనున్నారని, సైనికుల త్యాగాలను గుర్తించి వారికి గౌరవం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
గతంలో అగ్నివీర్లు, పౌర జీవితంలోకి మారి సేవలందిస్తున్న సైనిక సిబ్బందికి పదవీ విరమణ తర్వాత వృత్తి అవకాశాలను మెరుగుపర్చేందుకు రైల్వేశాఖ సహకారం అందిస్తోంది. అందులో భాగంగా రైల్వేలోని ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన పెంచుతోంది. పదవీ విరమణ చేసిన సిబ్బందికి సహాయపడటానికి, వారికి మద్దతుగా నిలబడటానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మాజీ అగ్నివీర్లు, సైనికులకు ఉపాధి కల్పించేందుకు లెవల్ 2, అంతకంటే పై స్థాయి పోస్టుల్లో 10 శాతం, లెవల్ 1 పోస్టుల్లో 20 శాతం రిజర్వేషన్లను రైల్వేశాఖ కల్పిస్తోంది. 2024,2025లో మాజీ సైనికుల కోసం 14,788 ఖాళీలను రైల్వేశాఖ భర్తీ చేసింది. లెవల్-1లో 6848, లెవల్ 2లో 8303 పోస్టులు ఉన్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు ఈ నియామకాలను చేపడుతున్నాయి. కాగా సైన్యంలో అత్యంత ప్రతిభ కనబర్చినవారికి, ధైర్యసాహాసాలను ప్రదర్శించినవాకికి వీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర లాంటివి పురస్కారాలను కేంద్రం ప్రదానం చేస్తూ ఉంటుంది.