
భారత్‌లో టొబాకో ఉత్పత్తులపై పన్నుల పెంపు కొత్త కాదు. గత పదేళ్లుగా సిగరెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు ఒక్కోసారి ఒక్కో విధంగా పెంచుకుంటూ పోతూ వచ్చాయి. ఇప్పుడు అదే క్రమంలో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్‌మెంట్ బిల్ -2025 సిగరెట్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ఈ బిల్లు అమలులోకి వస్తే ఇప్పటివరకు ఉన్న టాక్స్ లెక్కలన్నీ మారిపోతాయి. ఇప్పటివరకు సిగరెట్లపై 5 శాతం కంపెన్సేషన్ సెస్,1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ.2,000 నుంచి రూ.3,600 మధ్య ప్రత్యేక ఎక్సైజ్ టాక్స్ ఉండేది. దానికి జీఎస్టీ కూడా యాడ్ చేయడంతో ధరలు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. అయితే సిగరెట్లను GST 2.0 పరిధిలోకి తీసుకురావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీని అర్థం ఏంటి? అంటే 40 శాతం జీఎస్టీతో పాటు కొత్తగా రూపొందించిన భారీ ఎక్సైజ్ డ్యూటీ కూడా కలపాలని కేంద్రం యోచిస్తోంది.
ఇక్కడే అసలు షాక్. ఇప్పటివరకు ఉన్న రూ.200 నుంచి రూ.700 వరకు ఉన్న ఎక్సైజ్ స్లాబ్స్‌ను పక్కనపెట్టి, వాటి స్థానంలో1,000 సిగరెట్ స్టిక్స్‌పై రూ.2,700 నుంచి ఏకంగా రూ.11,000 వరకు కొత్త డ్యూటీ విధించే అవకాశం ఉంది. ఇది వింటేనే సిగరెట్ తాగేవారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఈ లెక్కలు సిగరెట్ సైజ్, పొడవు, ఫిల్టర్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే…రేట్లలో వ్యత్యాసాలు ఉంటాయి. ఇక్కడే సోషల్ మీడియాలో గందరగోళం మొదలైంది. చౌక సిగరెట్ ప్యాక్‌లపై ఏకంగా 400 శాతం పెరుగుతుందన్న ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా ప్రకారం రూ.18 ప్యాక్‌పై కొత్త ఎక్సైజ్ + జీఎస్టీ వేసి అది రూ.70 దాటుతుందని లెక్కగట్టారు. కానీ అది మొత్తం మార్కెట్‌కు వర్తిస్తుందా? అంటే కాదు. ఎందుకంటే ప్రీమియం సిగరెట్ల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై ఎక్సైజ్ పెరిగినా శాతం పరంగా ప్రభావం తక్కువ. రూ.300 ప్యాక్ రూ.500 అవ్వదు. కాస్త పెరుగుతుంది. అంతే. అంటే అసలు దెబ్బ చౌక సిగరెట్లకే ఉంటుంది. మాస్ మార్కెట్ బ్రాండ్లకే. రోజూ ప్యాక్ కొనేవాళ్లకే. ఇదే ప్రభుత్వ వ్యూహం కూడా. చౌకగా దొరికే సిగరెట్లను నెమ్మదిగా మార్కెట్ నుంచి తొలగించాలన్నది ప్రభుత్వ ప్లాన్‌గా ఉంది.
అయితే ఇక్కడ మరో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరిగితే వినియోగదారుడు మానేస్తాడంటే..లేదు. చరిత్ర చెబుతున్న నిజం ఏంటంటే… ధరలు పెరిగినప్పుడు చాలామంది అక్రమ మార్గాల వైపు మళ్లారు.
నకిలీ సిగరెట్లు.. స్మగ్లింగ్ బ్రాండ్లు.. ట్యాక్స్ ఎగ్గొట్టే ఉత్పత్తులపై మొగ్గు చూపే ప్రయత్నం చేస్తారు. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదం.ప్రభుత్వానికి కూడా రెవెన్యూ నష్టం. చట్టబద్ధ కంపెనీలకు భారీ నష్టాలు మూటగట్టుకుంటాయి.
సిగిరెట్ రేట్లు ఇంకా పెరిగితే ఇంకొంతమంది సిగరెట్లు మానేసి బీడీల వైపు మళ్లే అవకాశం కూడా ఉంది. బీడీలు ఇంకా చాలా చౌక. కానీ ఆరోగ్య పరంగా అవి మరింత ప్రాణాంతకం. ఈ మొత్తం వ్యవహారం టొబాకో కంపెనీలను కూడా ఆందోళనలో పడేసింది. పన్ను పెరిగితే ప్రభుత్వానికి డబ్బు వస్తుంది. కానీ కంపెనీల అమ్మకాలు పడిపోతాయి. ముఖ్యంగా మాస్ సెగ్మెంట్‌లో సిగరెట్ అమ్మకాలు భారీగా పడే అవకాశం ఉంది. అలాగే యువతపై కూడా ధరల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా అలవాటు పడేవాళ్లకు ధరే పెద్ద అడ్డంకి. మొత్తానికి ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే. సిగరెట్లను నెమ్మదిగా ప్రజలకు దూరం చేయడం. కాబట్టి “400 శాతం ధర పెరుగుతుంది” అన్న మాట పూర్తిగా నిజం కాదు.. అలాగని పూర్తిగా అబద్ధం కూడా కాదు. అది కొన్ని చౌక ప్యాక్‌లకే పరిమితం. ప్రీమియం సిగరెట్లపై అంత ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సో..ఇకపై సిగరెట్ తాగడం కేవలం ఆరోగ్యానికే కాదు… జేబుకు కూడా ముప్పే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి