Loan Apps: యాప్స్‌ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ఇవి తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు..

ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ వేధింపుల వల్ల ఇప్పటికే ఎంతో మంది బలయ్యారు. అందుకే లోన్ తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు చేసినా ఆ తర్వాత బాధపడాల్సి వస్తది. కాబట్టి ఈ టిప్స్ పాటించండి..

Loan Apps: యాప్స్‌ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ఇవి తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు..
Loan App Safety Tips

Updated on: Aug 29, 2025 | 1:43 PM

ప్రస్తుత కాలంలో లోన్‌ యాప్‌లు బాగా పెరిగిపోయాయి. త్వరగా, సులభంగా డబ్బు లభిస్తుండటంతో చాలా మంది వీటిపై ఆధారపడుతున్నారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మోసాలు, ఆర్థిక నష్టాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించాలి.

లెండర్‌ ఎవరు?

అన్ని లోన్ యాప్‌లు సురక్షితమైనవి కావు. అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద నమోదు అయి ఉండకపోవచ్చు. కాబట్టి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లేదా లోన్‌కు దరఖాస్తు చేయడానికి ముందు.. ఆ లెండర్‌ ఆర్బీఐలో రిజిస్టర్ అయ్యాడా లేదా ఏదైనా గుర్తింపు పొందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో అనుబంధం కలిగి ఉన్నాడా అని తనిఖీ చేయండి. మీరు ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో దీనిని ధృవీకరించుకోవచ్చు. నియంత్రణ లేని యాప్‌లు అధిక ఫీజులు వసూలు చేయవచ్చు లేదా చెల్లింపుల కోసం మిమ్మల్ని లేదా మీకు కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని వేధించవచ్చు.

ఎంత లోన్..?

లోన్ యాప్‌లు సులభంగా డబ్బు ఇస్తుండటంతో, అవసరానికి మించి లోన్ తీసుకోవాలని అనుకోవచ్చు. కానీ ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. మీరు ఈఎంఐ చెల్లింపు చేయకపోతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. భారీ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. మీ ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసుకోవడానికి లోన్ కాలిక్యులేటర్ ఉపయోగించండి. మీ మొత్తం ఈఎంఐలు మీ నెలవారీ ఆదాయంలో 30-40శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.

లోన్‌కు ఎంత ఖర్చు..?

లోన్ యాప్‌లు త్వరగా లోన్‌లను అందించినా.. మొత్తం ఖర్చును స్పష్టంగా చూపించకపోవచ్చు. అందుకే వార్షిక శాతం రేటును సరిగ్గా చూడండి. ఇందులో వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఫీజులు ఉంటాయి. ఈ అదనపు ఖర్చుల వల్ల లోన్ ఖర్చు గణనీయంగా పెరిగిపోతుంది.

క్రెడిట్ స్కోర్‌ ముఖ్యం

మీ లోన్ ఈఎంఐలను సకాలంలో చెల్లించడం వల్ల మీకు పెనాల్టీలు ఉండవు. మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో తక్కువ వడ్డీకి లోన్లు పొందే అవకాశాలను పెంచుతుంది. మీరు ఆటోమేటిక్ రీపేమెంట్స్‌ను ఆన్‌ చేయడం వల్ల ఈఎంఐ తేదీని మర్చిపోకుండా ఉంటారు.

షరతులను మర్చిపోవద్దు

డబ్బు త్వరగా కావాలనే తొందరలో చాలా మంది లోన్ షరతులు చదవరు. ఇది చాలా పెద్ద తప్పు. చెల్లింపు షెడ్యూల్, ఆలస్యపు చెల్లింపుల ఫీజులు, యాప్ గోప్యతా నియమాలను ఎల్లప్పుడూ చెక్ చేయాలి. కొన్ని యాప్‌లు మీ వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్‌లు, లొకేషన్‌కు యాక్సెస్ అడగవచ్చు. ఇలాంటి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..