
సామాన్యులపై నిత్యావసర సరుకుల భారం పెరగనుందా..? త్వరలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయా..? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు రాబోయే రోజుల్లో మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరుగుతుండటం, పామాయిల్, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఈ క్రమంలో కంపెనీలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు సిద్దమవుతున్నాయి. త్వరలోనే ఈ పెంపు చూడవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సబ్బు నుంచి బిస్కెట్ల వరకు ప్రతీ వస్తువు ధర పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
అయితే కొన్ని కంపెనీలు ధరలను నేరుగా పెంచకుండా వస్తువుల పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీనినే ష్రింకేజ్ పద్దతి అని పిలుస్తారు. ఈ పద్దతిని అవలంబించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్‌నివో పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. దీని వల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంతో ధరలను పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. సబ్బు, నూనె, బిస్కెట్లు, టీ ఉత్పత్తులు వంటి అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే పాల ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఒక ప్యాకెట్‌పై రూ.2 మేర కంపెనీలు పెంచాయి. పాల ధర పెరగడంతో వాటిని ఉపయోగించి తయారుచేసే ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులపై భారం పడుతుండగా.. ఇప్పుడు నిత్యావసరాల ధరలు పెంచితే గుదిబండగా మారనుంది. రోజువారీ కూలీ పనులు చేసుకుని బ్రతికేవారికి ఈ ధరలను భరించడం పెద్ద కష్టంగా మారవచ్చు.
బ్రిటానియా, గోద్రెజ్, హిందూస్థాన్ యునిలీవర్ వంటి కంపెనీలు ఇప్పటికే ధరల పెంపునపై ప్రకటన చేశాయి. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్త పరిస్థితులు వంటి పరిణామాలు ఉత్పత్తుల తయారీ ఖర్చును పెంచుతున్నాయి. దీంతో పాటు ఎల్‌నీవో పరిస్థితులు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. కంపెనీల మార్జిన్‌పై ఒత్తిడి పెంచడం వల్ల దేశంలోని కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. హెచ్‌యూఎల్, గోద్రెజ్, బ్రిటానియా వంటి కంపెనీలు జూన్ త్రైమాసికంలో వస్తువులు ధరలను పెంచాయి. కొన్ని ఉత్పత్తుల సైజును సవరించాయి. ఈ సారి 2 నుంచి 5 శాతం వరకు ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాయి. మిల్క్ దగ్గర నుంచి ఇంట్లో వాడే ప్రతీ వస్తువుల ధర పెరగనుంది. దీంతో రాబోయే రోజుల్లో కిరాణా బిల్లు అనేది పెరిగే అవకాశముంది.