ప్రస్తుత సమాజంలో మనకు ఒక్క రూపాయికి ఏముస్తుంది? కనీసం పిల్లల చాక్లెట్ కూడా రాదు. మరి అలాంటి ఒక్క రూపాయితోనే నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చని మీకు తెలుసా? అవునండి మీరు చదువుతున్నది నిజమే. కేవలం ఒక్క రూపాయి ఉంటే చాలు ఆ నగరంలో ఆటోలో ప్రయాణించొచ్చు. ఈ అరుదైన ఆఫర్ ను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అందజేస్తోంది. అయితే ఇది కేవలం బెంగళూరు ప్రజలకు మాత్రమేనని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. యూపీఐ పేమెంట్ల ప్రమోషన్లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈ ఒక్క రూపాయి ఆటో రైడ్ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం పండుగల సీజన్లో భాగంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024ను ప్రారంభించింది. ఈ సేల్లో యూపీఐ పేమెంట్లను ప్రోత్సహించేందుకు వీలుగా ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. అందులో భాగంగా బెంగళూరులో ఓ ప్రయోగాన్ని చేపట్టింది. బెంగళూరు సిటీలోని ఆటో డ్రైవర్లతో ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నగర వాసులకు ఒక్క రూపాయికే రైడ్ అందించాలని నిర్ణయించింది. దీనికి బెంగళూరులో విపరీతమైన స్పందన లభిస్తోంది.
బెంగళూరు ప్రజలు ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బంపర్ ఆఫర్ కు ఆకర్షితులవుతున్నారు. ఒక్కరూపాయికే రైడ్ బుక్ చేసుకుని నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా చుట్టేస్తున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్ లో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్ కార్ట్ పలుముఖ్య ప్రాంతాల్లో స్టాల్స్ ను సైతం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో విస్తృత ప్రచారాన్ని కల్పిస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బంపర్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతోంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో రద్దీ సమయాల్లో రూపాయికే ఆటో రైడ్ లను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఈ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ నకు భారీ స్పందన వస్తోంది. ఆటో రైడ్ ల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తమ కొత్త తరహా ప్రచారానికి అద్భుత స్పందన వచ్చిందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ట్రాఫిక్ రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం అలాగే క్యాష్ లెస్ యూపీఐ సేవలను ప్రమోట్ చేసేందుకు దీనిని తీసుకొచ్చామని కంపెనీ పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..