Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. ఇవి తెలుసుకుంటే మీకు లక్షల్లో ఆదా..

ఈ మధ్య కాలంలో సొంతిల్లు అనేది చాలా కష్టంగా మారింది. భారీగా ధరలు పెరగడమే దీనికి కారణం. ఇక సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి చాలా మంది హోమ్ లోన్స్ తీసుకుంటున్నారు. అయితే వడ్డీ రేట్ల విషయంలో మీరు చేసే తప్పులు లక్షల్లో నష్టాలను తెస్తాయి. అందుకే లోన్ తీసుకునే ముందు వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. ఇవి తెలుసుకుంటే మీకు లక్షల్లో ఆదా..
Home Loan Interest Rates

Updated on: Oct 30, 2025 | 10:41 AM

ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కల. ఈ మధ్య కాలంలో ఈ కలను నెరవేర్చుకోవడానికి ఎక్కువగా హోమ్ లోన్‌పై ఆధారపడుతున్నారు. ఇది ఆనందంతో పాటు ఆందోళనను తెస్తుంది. ముఖ్యంగా వడ్డీ రేటును ఎంచుకునే విషయానికి వస్తే.. స్థిర, ఫ్లోటింగ్ వంటి రకాలు ఉంటాయి. లోన్ తీసుకునే ముందు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి. వీటిపై క్లారిటీ ఉంటే మీకు లక్షల్లో ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయి.

స్థిర వడ్డీ రేటు

స్థిర వడ్డీ రేట్ ప్రయోజనం ఏంటంటే.. మీ ఈఎంఐ ప్రతి నెలా ఒకే విధంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా మీ వాయిదా స్థిరంగా ఉంటుంది. ఇది బడ్జెట్‌ను సులభతరం చేస్తుంది. ఈఎంఐ స్థిరంగా ఉండటం వలన నెలవారీ బడ్జెట్ ప్రణాళిక సులభమవుతుంది. ఇది ఆర్థికంగా స్థిరత్వం కోరుకునే వారికి మనశ్శాంతిని ఇస్తుంది. అయితే స్థిర వడ్డీరేటు ఫ్లోటింగ్ రేటు కంటే 1 నుంచి 1.5% వరకు ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గితే.. స్థిర రేటు వల్ల ఆ ప్రయోజనం మీకు దక్కదు.

ఫ్లోటింగ్ రేటు

ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్ పై వడ్డీ రేటు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఇది రెపో రేటు లేదా బ్యాంక్ బెంచ్‌మార్క్ రేటుతో ముడిపడి ఉంటుంది. మార్కెట్ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, మీ ఈఎంఐ తగ్గుతుంది. అయితే ఒక ప్రమాదం కూడా ఉంది.. ఆర్బీఐ రేట్లు పెంచితే.. మీ ఈఎంఐ పెరుగుతుంది. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే దీర్ఘకాలికంగా, ఫ్లోటింగ్ రేట్లు సాధారణంగా స్థిర రేట్ల కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండవు.

ఫిక్స్‌డ్ నుండి ఫ్లోటింగ్‌కి ..?

మీరు అధిక స్థిర రేటుకు రుణం తీసుకుని.. మార్కెట్ రేట్లు ఇప్పుడు తగ్గి ఉంటే, బ్యాలెన్స్ బదిలీ మంచి ఎంపిక కావచ్చు. దీని అర్థం మీ రుణాన్ని తక్కువ వడ్డీ రేటును అందించే మరొక బ్యాంకుకు బదిలీ చేయడం. కేవలం 0.5% లేదా 1శాతం రేటు తగ్గింపు లక్షల రూపాయల ఆదాకు దారితీస్తుంది. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు లేదా బదిలీ ఛార్జీలను వసూలు చేస్తాయి. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఈ ఖర్చులను గమనించండి.

ఎవరికి ఏ లోన్ సరైనది..?

మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి, ఎక్కువ కాల వ్యవధిని కలిగి ఉండి, మార్కెట్ పరిస్థితులను తట్టుకోగలిగితే, ఫ్లోటింగ్ రేటు మీకు మంచిది. వడ్డీ తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది. మీరు పదవీ విరమణకు దగ్గరగా ఉంటే లేదా కచ్చితమైన ఈఎంఐ కోరుకుంటే.. స్థిర లేదా హైబ్రిడ్ వడ్డీ రేటు ఎంచుకోవడం బెటర్. ఇది మీ ఈఎంఐలలో స్థిరత్వాన్ని అందిస్తుంది. ఆకస్మిక పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

హోమ్ లోన్ తీసుకునే ముందు మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ఆదాయ అంచనాలు, వడ్డీ రేట్ల మార్కెట్ ట్రెండ్‌లను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..