జీవితం ఆనందంగా సాగిపోవడానికి ఆర్థిక ప్రణాళికలు చాలా అవసరం. మనకు వచ్చే ఆదాయాన్ని పొదుపు చేసి, దాన్నిపెట్టుబడిగా పెట్టుకోవడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నప్పడు ఆదాయం బాగానే వస్తుంది కాబట్టి బత టానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఆదాయం తగ్గిపోతుంది. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వీటి పరిష్కారానికి ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలి. అయితే మధ్యతరగతి వర్గాల వారు పింఛన్ పథకాల కోసం డబ్బులు వెచ్చించలేమని భావిస్తారు. కానీ వారి కోసం అటల్ పెన్షన్ యోజన అనే పథకం అందుబాటులో ఉంది. రోజుకు కేవలం ఏడు రూపాయలు చెల్లిస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5 వేల చొప్పున లభిస్తాయి.
పదవీ విరమణ తర్వాత సామాన్యులకు ఉపయోగపడే పొదుపు పథకాలలో అటల్ పెన్షన్ యోజన ఒకటి. ఇది పేద ప్రజలకు అందుబాటులో ఉండే పథకం. పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా పింఛన్ రూపంలో డబ్బులు అందజేస్తుంది. దీనిలో 18 ఏళ్ల వయసులో చేరిన వారు నెలకు రూ.210 అంటే రోజుకు ఏడు రూపాయల చొప్పున చెల్లించాలి. అదే 32 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.689 చొప్పున కట్టాలి. రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున పింఛన్ లభిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 – 06 బడ్జెట్ లో ప్రకటించారు. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అసంఘటిత రంగంలోని ప్రజలందరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) ఆర్కిటెక్చర్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ ఆథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) దీన్ని నిర్వహిస్తుంది.
అసంఘటిత రంగాల కార్మికులు రోజు వారి పనులు చేసుకుని జీవనం సాగిస్తారు. వారి ఆదాయం ఖర్చులకే సరిపోతుంది. ఇక వయసు ముదిరిన తర్వాత పనిచేసే ఓపిక ఉండదు. అప్పుడు అటర్ పెన్షన్ యోజన వారికి అండగా ఉంటుంది. దీని ద్వారా నెలకు రూ.5 వేలు పెన్షన్ పొందే అవకాశం ఉంది. 18 ఏళ్ల నుంచి ఎంత తొందరగా చేరితే అంత ప్రయోజనం కలుగుతుంది.
అటర్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకూ పింఛన్ లభిస్తుంది. చందాదారుల సహకారంలో 50 శాతం లేదా రూ.వెయ్యిలో ఏది తక్కువైతే దాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఆదాయపు పన్ను పరిధిలోని రాకుండా, చట్టబద్దమైన సామాజిక భద్రతా పథకాలలో లేనివారికి వర్తిస్తుంది.
వయసు తక్కువ ఉన్నప్పుడే ఈ పథకంలో చేరితే ఎంతో ఉపయోగం ఉంటుంది. నెలవారీ చందా చాలా తక్కువగా ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 18 ఏళ్ల వయసున్న వారు నెలకు కేవలం రూ.210 చెల్లిస్తే సరిపోతుంది. 32 ఏళ్లలో చేరితే రూ.369, అలాగే 40 ఏళ్లలో చేరితే రూ.1454 చొప్పున కట్టాలి. చందాదారులందరికీ రిటైర్మెంట్ నుంచి నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్ అందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..