చిరిగిన, పాడైపోయిన నోట్లను ఉచితంగా మార్చుకోవచ్చు.. మన బ్యాంక్స్‌లోనే

చిరిగిన, పాతబడిన, పాడైపోయిన కరెన్సీ నోట్లను బ్యాంకులు లేదా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. రోజువారీ పరిమితులు, నోటు చిరిగిన స్థితి, దాని విలువ ఆధారంగా మార్పిడి నిబంధనలు వర్తిస్తాయి. నోటు సైజు, ముక్కల సంఖ్యను బట్టి పూర్తి లేదా పాక్షిక విలువ చెల్లిస్తారు.

చిరిగిన, పాడైపోయిన నోట్లను ఉచితంగా మార్చుకోవచ్చు.. మన బ్యాంక్స్‌లోనే
Torn Notes

Updated on: Feb 23, 2026 | 7:26 AM

మీ వద్ద చిరిగిన లేదా పాడైపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసమే ఈ న్యూస్. వాటిని సులభంగా, ఉచితంగా మార్చుకోవచ్చు. ఈ నోట్లను బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం ఉంది. కొన్ని ఏజెన్సీలు, షాపులు కూడా నోట్ల మార్పిడి సేవలను అందిస్తాయి, అయితే అవి కొంత కమిషన్ వసూలు చేస్తాయి. కానీ, బ్యాంకుల్లో మాత్రం చిరిగిన లేదా పాడైపోయిన నోట్లను ఇచ్చి, ఉచితంగా కొత్త నోట్లను పొందవచ్చు. దీనికి ఎలాంటి డాక్యూమెంట్స్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎలాంటి ఫామ్స్ నింపాల్సిన పని లేదు. చిరిగిన నోట్లను మార్చుకునేందుకు కొన్ని కండీషన్స్ ఉన్నాయి. రోజుకు ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని లేదా 20 నోట్లకు మించి మార్చుకోవడానికి వీలు లేదు. ఒకవేళ 20 నోట్ల కన్నా ఎక్కువ మార్చుకోవాలన్నా లేదా ఐదు వేల రూపాయల కన్నా ఎక్కువ డబ్బును మార్చుకోవాలన్నా, బ్యాంకుకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవలి. అప్పుడు బ్యాంకు ఒక రిసిప్ట్ ఇచ్చి, డబ్బును తర్వాత చెల్లిస్తుంది. ఇలాంటి సందర్భాలలో బ్యాంకులు సర్వీస్ ఛార్జ్ వసూలు చేయవచ్చు. మాసిపోయిన, చిరిగిన, కాలిపోయిన నోట్లను మార్చుకోవచ్చు, కానీ దీనికి కొన్ని కండిషన్లు వర్తిస్తాయి.

ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల వంటి సింగిల్ డిజిట్ డినామినేషన్ నోట్లు రెండు కంటే ఎక్కువ ముక్కలుగా ఉండకూడదు. ఆ రెండు ముక్కలు ఒకే నోటువి అయి ఉండాలి. చిరిగిన నోటుపై ముఖ్యమైన ఫీచర్లు పాడైపోకూడదు, మిస్ కాకూడదు. రెండు ముక్కలైన నోటులో కనీసం ఒకదానిపై నోటుకు సంబంధించిన నెంబర్ ఖచ్చితంగా కనిపించాలి. పది రూపాయలు, 20 రూపాయల వంటి డబుల్ డిజిట్ కరెన్సీ నోట్లకు కూడా దాదాపు ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. రెండు కంటే ఎక్కువ ముక్కలుగా చిరిగితే మార్చుకోవడానికి వీలుండదు. చిరిగిన నోట్లపై దాని నెంబర్ ఖచ్చితంగా కనిపించాలి. అయితే, కనిపించకుండా పోయిన, అసంపూర్ణంగా ఉన్న, దొంగతనానికి గురైన నోట్లను మార్చుకోవడానికి వీలుండదని RBI నిబంధనలు చెబుతున్నాయి. మాసిన నోటుకు బదులుగా దానికి సమాన విలువ ఉండే నోటునే ఇస్తారని చెప్పలేం. కొన్నిసార్లు దాని విలువను తగ్గించి కూడా ఇస్తారు. దీని విలువ లెక్కించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మాసిన నోటుపై ఉన్న అక్షరాలు పూర్తిగా కనిపించకుండా పోకూడదు. నోటుపై కనిపించే అక్షరాలను పరిశీలించి, అది సరైన నోటే అని ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ రూడీ చేసుకున్నాక దానికి పూర్తి విలువ చెల్లిస్తారు. చిరిగిన నోట్ల విషయానికి వస్తే, రూ.1 నుంచి రూ.20 వరకు గల నోట్లలో పెద్ద ముక్క అసలు నోటు సైజులో 50% కన్నా ఎక్కువ ఉంటే, దానికి పూర్తి మొత్తం ఇస్తారు. 50% కి సమానంగా ఉన్నా లేదా అంతకన్నా తక్కువ ఉన్నా దాని మార్పిడికి అంగీకరించరు.

రూ.50, రూ.100, రూ.500, రూ.2000 నోట్ల విషయంలో కండీషన్స్ కాస్త భిన్నంగా ఉన్నాయి. చిరిగిన నోట్లలోని పెద్ద ముక్క ఆ నోటు సైజులో 40% కంటే తక్కువ ఉంటే ఆ నోటును మార్చుకోలేం. పెద్ద ముక్క ఆ నోటు సైజులో 40% కంటే ఎక్కువ ఉండి, 80% కంటే తక్కువ ఉంటే దాని విలువలో సగాన్ని మాత్రమే చెల్లిస్తారు. చిరిగిన నోట్లోని పెద్ద ముక్క, ఆ నోటు అసలు సైజులో 80% కన్నా ఎక్కువ ఉంటేనే ఆ నోటు మార్పిడిలో పూర్తి విలువను ఇస్తారు. కరెన్సీ నోట్లను కావాలని మార్పులు, చేర్పులు చేసినా.. చింపినట్లు  కనిపించినా ఆ నోట్లను తీసుకోరు. అయితే, ఈ నోట్లు కావాలనే చింపినట్లు నిరూపించడం అంత ఈజీ కాదు.  అధికారులు పూర్తి పరిశీలన జరిపి.. అవి పొరపాటున పాడైన నోట్లా, లేక కావాలనే చింపేశారా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు.

Also Read: ఎగ్గొట్టిన డబ్బులను వసూలు చేసుకోవడం ఈజీ.. ఈ టెక్నిక్ మీరూ తెలుసుకోండి 

Follow Us