EPFO New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక PF డబ్బులు నెలనెలా విత్‌డ్రా చేసుకోవచ్చు!

EPFO కొత్త SWP విధానానికి ఆమోదం తెలపడంతో ఉద్యోగులు, పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. ఇకపై రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక వాయిదాల్లో పొందే అవకాశం కలగనుంది. అలాగే పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ, అర్హులైన సభ్యులు తమ ఖాతాలోని మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఈ కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది వంటి పూర్తి మార్గదర్శకాలను EPFO ఇంకా ప్రకటించాల్సి ఉంది..

EPFO New Rules: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక PF డబ్బులు నెలనెలా విత్‌డ్రా చేసుకోవచ్చు!
EPFO Systematic Withdrawal Plan

Updated on: Nov 20, 2026 | 9:36 AM

ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీపి కబురు అందించింది. పదవీ విరమణ తర్వాత పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త విధానాన్ని తీసుకురావడానికి ఆమోదం తెలిపింది. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) పేరుతో ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బులను వాయిదాల పద్ధతిలో తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తంపై ఈపీఎఫ్ వడ్డీ కూడా కొనసాగుతుంది. నవంబర్ 19న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 240వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

EPFO కొత్త SWP విధానం ఎలా పనిచేస్తుంది?

ఇప్పటివరకు ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునేవారు. ఆ డబ్బును భవిష్యత్తు అవసరాలకు ఎలా పెట్టుబడి పెట్టాలి? నెలవారీ ఖర్చులను ఎలా నిర్వహించాలి? అనే సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యలకు పరిష్కారంగా EPFO కొత్త SWP విధానాన్ని తీసుకొస్తోంది. ఈ సదుపాయం ద్వారా రిటైర్మెంట్ తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీగా లేదా నిర్ణీత వ్యవధిలో విత్‌డ్రా చేసుకోవచ్చు.

కొత్త విధానంలో ప్రధానంగా ఈ అవకాశాలు ఉండనున్నాయి.

  • నెలవారీ విత్‌డ్రాయల్: ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని తీసుకోవచ్చు.
  • మూడు నెలలకు ఒకసారి: ప్రతి మూడు నెలలకు ఒకసారి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఏడాదికి ఒకసారి: సంవత్సరానికి ఒకసారి అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు.
  • పాక్షిక విత్‌డ్రాయల్: కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల రూపంలో పొందవచ్చు.
  • వడ్డీ మాత్రమే విత్‌డ్రాయల్: అసలు మొత్తాన్ని అలాగే ఉంచి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే తీసుకునే అవకాశం కూడా ప్రతిపాదించారు.

ఈ విధానం పూర్తిగా స్వచ్ఛందం. ఉద్యోగులు తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎంచుకున్న తర్వాత కూడా అవసరమైతే మధ్యలో నిలిపివేసి మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిగిలిన పీఎఫ్ డబ్బుపై వడ్డీ వస్తుందా?

కొత్త SWP విధానంలో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఇదే. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి కొంత మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకుంటే.. మిగిలిన డబ్బు EPF వ్యవస్థలోనే పెట్టుబడిగా కొనసాగుతుంది. ఆ మొత్తంపై వర్తించే EPF వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తన పీఎఫ్ ఖాతాలో రూ.30 లక్షలు ఉన్నాయని అనుకుందాం. మొత్తం డబ్బును ఒకేసారి తీసుకోకుండా SWP విధానాన్ని ఎంచుకుంటే.. అవసరమైన మొత్తాన్ని నెలవారీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన సొమ్ముపై వడ్డీ కొనసాగుతుంది. దీంతో రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చులకు కొంత ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంటుంది. EPFO తీసుకొస్తున్న ఈ కొత్త విధానం తొలిదశలో 55 ఏళ్లు పైబడిన సభ్యులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పీఎఫ్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నిల్వ ఉన్న సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ఈ సదుపాయం ద్వారా ప్రయోజనం కలగనుందని అంచనా. రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, క్రమబద్ధమైన ఆదాయంగా పొందేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.

పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనల్లోనూ మార్పులు

SWP విధానానికి ఆమోదం తెలపడమే కాకుండా.. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలను కూడా EPFO సులభతరం చేసింది.

  • 55 ఏళ్లలోపు సభ్యులు అర్హత కలిగిన పీఎఫ్ నిల్వలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఈ పరిమితి 75 శాతంగా ఉండేది.
  • నిరుద్యోగ పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు గతంలో ఉన్న 12 నెలల నిరీక్షణ వ్యవధిని రెండు నెలలకు తగ్గించింది.
  • వైద్య చికిత్స, విద్య, వివాహం, ఇంటి కొనుగోలు, నిర్మాణం, గృహ రుణ చెల్లింపు, ఇంటి మరమ్మతుల వంటి అవసరాలకు పాక్షిక ఉపసంహరణ
  • సదుపాయాలను సులభతరం చేసింది.
  • ఈ మార్పుల ద్వారా ఉద్యోగులు తమ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ డబ్బులను వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది. అదే సమయంలో రిటైర్మెంట్ కోసం కొంత మొత్తాన్ని భద్రంగా ఉంచుకోవడం కూడా ఈ మార్పుల లక్ష్యం.

కొత్త SWP విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినప్పటికీ.. పూర్తి స్థాయి అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. విత్‌డ్రాయల్ పరిమితులు, కనీస బ్యాలెన్స్, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాబట్టి కొత్త SWP సదుపాయం వెంటనే అందుబాటులోకి వచ్చిందని భావించకూడదు. అలాగే EPF మొత్తానికి సంబంధించిన ఈ కొత్త విధానం, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే నెలవారీ పెన్షన్‌కు వేర్వేరు ప్రయోజనాలు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులు తమ జీవితకాల పొదుపును ఒకేసారి ఖర్చు చేయకుండా క్రమబద్ధంగా వినియోగించుకునేందుకు SWP విధానం ఉపయోగపడనుంది. మిగిలిన మొత్తంపై వడ్డీ పొందే అవకాశం ఉండటంతో పాటు, నెలవారీ ఖర్చులకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఇది సహాయపడవచ్చు. మొత్తంగా EPFO తీసుకొస్తున్న ఈ కొత్త విధానం రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలో కీలక మార్పుగా మారే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us