
మీరు చాలా ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా.. మీకు పీఎఫ్ అకౌంట్ లేదా..? కంపెనీ నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల మీరు పీఎఫ్ సదుపాయం పొందలేకపోయారా..? అయితే మీకు శుభవార్త. మీరు ఇప్పుడు పీఎఫ్ పరిధిలో చేరవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అదే ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్(ఈఈసీ) 2026 స్కీమ్. సాంకేతిక కారణాల వల్ల పీఎఫ్ పరిధిలో చేరనివారి కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. అక్టోబర్ 31 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. 2009 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య అర్హత ఉండి పీఎఫ్ పరిధిలో చేరనివారు ఈ కొత్త స్కీమ్ ద్వారా చేరడానికి అర్హులు అవుతారు. గత 17 ఏళ్ల వ్యవధిలో వివిధ కారణాల వల్ల చేరని ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.
అయితే ఈ క్యాంపెయిన్ ద్వారా చేరాలంటే ఉద్యోగి ప్రస్తుతం అదే సంస్థలో పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగం మానేసిన ఉద్యోగులకు ఇది వర్తించదు. ఇందులో చేరాలంటే ముందుగా కంపెనీ హెచ్‌ఆర్ లేదా మేనేజ్‌మెంట్‌ను సంప్రదించాలి. కొన్ని సంస్థలు ఉద్యోగులకు అర్హత ఉన్నప్పటికీ.. నిబంధనలు పాటించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి సంస్థల్లోని ఉద్యోగులు ఇప్పుడు చేరవచ్చు. కంపెనీలోని ఉద్యోగులు ఎలాంటి చట్టపరమైన వివాదాలు లేకుండా పీఎఫ్ పరిధిలోకి వచ్చేందుకు ఇది వీలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా కొత్తగా చేరిన పక్షంలో ఉద్యోగి తన గత వాటాలను ఇప్పుడు చెల్లించాల్సిన పని లేదు. ఉద్యోగి వాటాను జీతం నుంచి కట్ చేయని పక్షంలో.. ఇప్పుడు ఉద్యోగి చెల్లించాల్సిన పని లేదు. ఉద్యోగి వాటాను పూర్తిగా మాఫీ చేయగా.. యాజమాన్యం తన వాటాను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పీఎఫ్ ప్రయోజనాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.
కంపెనీలు తమ రికార్డులను పరిశీలించి అర్హులైన ఉద్యోగులను గుర్తించారు. అనంతరం ఉమాంగ్ యాప్ ద్వారా కొత్త యూఏఎన్ కేటాయించాలి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) ద్వారా చట్టబద్దమైన వాటాను కంపెనీలు జమ చేయాలి. కేవలం ఆన్‌లైన్ విధానంలో సులభంగా యాజమన్యాలు ఉద్యోగులను చేర్చవచ్చు. ఎలాంటి మధ్యవర్తుల జోక్యం అవసరం ఉండదు.అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈపీఎఫ్ఓ తెలపింది.