
దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి ఈపీఎఫ్ఓ సౌకర్యం అనేది ఉంటుంది. ప్రతీ నెలా మీ ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని కట్ చేసి ఇందులో కంపెనీ యాజమాన్యం జమ చేస్తుంది. ఇక దీనికి సమాన భాగంలో కంపెనీ తన వాటాను అందిస్తుంది. మీ జీతం ఆధారంగా పీఎఫ్ సొమ్ము ఎక్కువ లేదా తక్కువ జమ కావొచ్చు. ఉద్యోగులు పొందే నెల జీతం తమ రోజువారీ అవసరాలకు పోతుంది. ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలకు వాటిని ఖర్చు చేస్తూ ఉంటారు. దీంతో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. దీంతో ప్రైవేట్ ఉద్యోగులకు పొదుపు నిధి ఉండాలనే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ సౌకర్యాన్ని కేంద్రం తీసుకొచ్చింది. అనేక విధాలుగా దీని ద్వారా ఉద్యోగులకు బెనిఫిట్ పొందవచ్చు. పింఛన్, ఆరోగ్య బీమా, నెలవారీ బ్యాలెన్స్‌పై వడ్డీ లాంటివి పొందవచ్చు. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయనేది ఒక్కసారి చూద్దాం.
ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్‌పై వడ్డీ సౌకర్యం అందుబాటులోకి ఉంటుంది. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వీటిని విడుదల చేస్తారు. దీంతో ఉద్యోగుల పొదుపు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీపై ఎలాంటి పన్ను ఉండదు. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి ఏడాదికి రూ.1.5 లక్షల వరకు చేసే చెల్లింపులపై సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహయింపు ఉంటుంది. ఈ రెండు పీఎఫ్ ఖాతాదారులకు ఉపయోగపడే అంశాలుగా చెప్పవచ్చు. ఇక దీంతో పాటు పెన్షన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. యజమాని వాటా 12 శాతంలో 8.33 శాతం పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో ఆర్ధిక భద్రత దీని ద్వారా ఏర్పడుతుంది. 8.33 శాతం పెన్షన్ పథకంలో జమ అయితే.. మిగతా మొత్తం ఈపీఎఫ్ కార్పస్‌లో జమ అవుతుంది. మీ శాలరీ స్లిప్‌లో కేవలం ఉద్యోగి, యజమాని వాటా మాత్రమే కనిపిస్తుంది. పెన్షన్ సొమ్ము అనేది కనిపించదు.
ఇక పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జీవిత బీమా ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఈ లైఫ్ ఇన్యూరెన్స్‌కు మీరు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కేవలం యజమాని, కేంద్రం దీనిని వాటా చెల్లిస్తాయి. ఒకవేళ సర్వీసులో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.7 లక్షల వరకు సొమ్ము అందుతుంది. మీ పొదుపు నిధి ఆధారంగా దీనిని లెక్కించి కుటుంబానికి అందిస్తున్నారు. మీకు ఏదైనా జరిగినప్పుడు కుటుంబ ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ఇది సహాయపడుతుంది. అలాగే ఉద్యోగులు తమ అకౌంట్లోని డబ్బులను ఎప్పుడైనా తీసుకోవచ్చు. గృహ, వైద్య, విద్య, పెళ్లి వంటి అవసరాలను వీటిని ఉపయోగించుకోవచ్చు.